Saturday, April 20, 2024

విప్రో పై చర్య తీసుకోండి.. కార్మికశాఖకు ఉద్యోగుల సంఘం ఫిర్యాదు

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో పై చర్యలు తీసుకోవాలని నాస్సెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (ఎన్‌ఐటీఈఎస్‌) కేంద్ర కార్మిక శాఖను కోరింది. క్యాంపస్‌ సెలక్షన్‌ ద్వారా ఎంపిక చేసుకున్ను విద్యార్ధులకు విప్రో ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఈ సంఘం ఫిర్యాదు చేసింది. 2021 సెప్టెంబర్‌లోనే 2000 మంది విద్యార్ధులను క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా విప్రో ఎంపిక చేసిందని, వీరికి శిక్షణ ఇచ్చిన తరువాత కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవడంలేదని పేర్కొంది. క్యాంపస్‌ ఇంటర్యూలు, ఇతర టెస్ట్‌ల తరువాత ఎంపిక చేసుకుని వారికి ఈ-మెయిల్స్‌ కూడా పంపించిందని ఎన్‌ఐటీఈఎస్‌ పేర్కొంది.వీరికి 3.5 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తామని ఆఫర్‌ లెటర్‌లో పేర్కొంది. ఇలా ఎంపిక చేసుకున్న వారికి 2022 ఫిబ్రవరిలో విప్రో లేఖ లు రాసిందని, ఇందులో శిక్షణకు అయ్యే ఖర్చు 30 నుంచి 40 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందిని, లేకుంటే మూడు నెలల పాటు ఇంటర్నషిప్‌ చేయాల్సి ఉంటుందని తెలిపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులు టెస్ట్‌లో 60 శాతం మార్కులతో పాసైతే వార్షిక వేతనం 6.5 లక్షలు చెల్లిస్తామని చెప్పిందని తెలిపారు.

ఇంటర్నషిప్‌ కాలంలో విద్యార్ధి ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. వీరి శిక్షణ 2022, జులైలో పూర్తయిందని తెలిపింది. ఇలా శిక్షణ పూర్తి చేసిన వారిని ఆగస్టులోనే ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉన్నా, విప్రో వాయిదా వేస్తూ వస్తోందని ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. వీరిలో చాలా మందికి ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ, విప్రోలో శిక్షణ పూర్తి చేసుకున్నందున వాటిలో చేరలేదని తెలిపింది. ఈ విషయాలను పరిశీలించి విప్రో పై తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఎన్‌ఐటీఈఎస్‌ కోరింది. ఐటీ కంపెనీలు అన్ని ఉద్యోగులను పెద్ద సంఖ్యలో రిక్రూట్‌ చేసుకుంటామని ప్రకటిస్తున్న సమయంలోనే విప్రో మాత్రం తీసుకున్న ఉద్యోగులను కూడా విధుల్లోకి తీసుకోవడంలేదు. ఇటీవలే రెండు ఉద్యోగాలు చేస్తున్నరన్న కారణంగా 300 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను విప్రో తొలగించింది. తాము మూన్‌లైటింగ్‌ను అనుమతించలేమని కంపెనీ ఛైర్మన్‌ రషద్‌ ప్రేమ్‌జీ స్పష్టం చేశారు. కార్మిక శాఖకు అందిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement