Thursday, April 25, 2024

Follow up : స్థాక్‌ దిగ్గజం రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ముంబాయిలో ఆదివారం నాడు హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని వారాల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఆయన అత్యంత సాధారణ జీవితం గడిపేవారు. స్టాక్‌మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆయన్ని బిగ్‌బుల్‌, వారెన్‌ బఫేట్‌ ఆఫ్‌ ఇండియా గా ఆయన పేరుగాంచారు. ఝున్‌ఝన్‌వాలా మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని సానుభూతి తెలిపారు.

ఆయన మరణంతో స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మార్కెట్‌లో డబ్బును ఎలా మదుపు చేయాలో ఆయన అద్భతంగా చేసి చూపించారు. స్టాక్‌మార్కెట్‌ అంటేనే భయపడే వారికి ఆయన ఓ దారి చూపించారు. మార్కెట్లు పడినప్పుడు మంచి స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని, పెరిగినప్పుడు వాటిని విక్రయించి లాభాలు ఎలా పొందాలో ఆయన ఆచరించి చూపించారు. ఆలానే ఆయన సంపదను పెంచుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టాక్‌మార్కెట్లపై పట్టుసాధించిన ఆయన బడా ఇన్వెస్టర్‌గా ఎదిగారు. ఆయన ఏ షేరులో పెట్టుబడి పెట్టినా లాభాల వర్షం కురిసింది.

రాజస్థాన్‌లోని ఝున్‌ఝన్‌ ప్రాంతం నుంచి ఆయన కుటుంబం ముంబైకి వలస వచ్చారు. ఆయన తండ్రి రాథేశ్యామ్‌ ఆదాయపన్ను శాఖలో ఉద్యోగి. ఆయనకు హైదరాబాద్‌ కు బదిలీ అయినప్పుడు ఝున్‌ఝున్‌ వాలా ఇక్కడే జన్మించారు. తండ్రి ద్వారా స్టాక్‌ మార్కెట్లపై ఆసక్తి పెంచుకున్న ఝున్‌ఝున్‌వాలా 17 సంవత్సరాల వయస్సులోనే మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. తల్లిదండ్రుల సూచన మేరకు ఆయన 1984లో సీఏలో చేరి,దాన్ని పూర్తి చేశారు. స్టాక్‌మార్కెట్‌ సూచీ 150 పాయింట్లు ఉన్న సమయంలో ఆయన 5 వేలు అప్పు తీసుకుని మార్కెట్‌లో ప్రవేశించారు. మొదటిసారి కొనుగోలు చేసిన టాటా టీ షేర్లు ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

5 వేలతో ప్రారంభం…

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా స్టాక్‌మార్కెట్‌ జర్నీ 1985లో 5వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైంది. ఆయన చనిపోయో సమయానికి ఆయన నికర ఆస్తుల విలువ 43,800 కోట్లు. దేశంలో సంపన్నుల జాబితాలోఆయన 36వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపదలో అధికభాగం స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా వచ్చిందే. అందుకే అయన్ని బిగ్‌బుల్‌ అని, ఇండియన్‌ వార్న్‌ బఫెట్‌ అని పిలుస్తారు. తాజాగా కార్పోరేట్‌ షేర్‌హోల్డింగ్స్‌ ప్రకారం ఆయన కు ఉన్న 32 స్టాక్స్‌ విలువ 31,904.8 కోట్లు . ఆయనకు సెసా గోవా, టైటాన్‌ షేర్లు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టాయి. ఆయన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో బ్రోకరేజీ సంస్థను ప్రారంభించారు. 1993 నాటికి ఆయన షేర్ల మార్కెట్‌ విలువ 200 కోట్లు. అనేక సందర్భాల్లో ఆయన షేర్ల విలువ రెట్టింపు కంటే ఎక్కవగా పెరిగడంతో ఆయన సంపద పెరిగింది.

- Advertisement -

సేవా రంగంలో …

సమాజానికి నువ్వు ఎంతోకొంత తిరిగి ఇవ్వాలని తండ్రి చెప్పిన మాట ప్రకారం సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన పలు సందర్బాల్లో చెప్పేవారు. తండ్రి చనిపోయిన తరువాత సాంపదానలో ప్రతి ఏటా 25 శాతం దానంగా ఇవ్వాలని నిర్ణయించికుని , దాని ప్రకారమే చేస్తూ వచ్చారు. ప్రధానంగా విద్యా, వైద్య రంగాలకు ఆయన ఎక్కువ సాయం అందించారు. ఆగస్త్య ఇంటరేషనల్‌ ఫౌండేషన్‌కు ఆర్ధికంగా అండగా ఉండేవారు. శంకర్‌ ఐ కేరుతో కలిసి ముంబైలో ఆర్‌.ఝున్‌ఝన్‌వాలా శంకర్‌ ఐ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఇది లాభాపేక్షలేని సంస్థ. పేదలకూ, గ్రామీణులకు సాయపడేందుకు కొన్ని స్వచ్ఛంధ సంస్థలకూ ఆయన సాయం చేశారు.

ప్రధాన పెట్టుబడులు..

టైటాన్‌ కంపెనీలో ఆయనకు ఆయన భార్య రేఖకు 44,850,970 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. మొత్తం కంపెనీలో ఆయనకు 5.05 శాతం వాటా ఉంది. వీటి విలువ 11,086.9 కోట్లు. స్టార్‌ హెల్త్‌ లో 7,017.5 కోట్లు, మెట్రో బ్రాండ్స్‌లో 3,348.8 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. స్టార్‌హెల్త్‌లో ఆయనకు 100,758,935 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీ విలువలో 17.49 శాతం వాటా ఆయనకు ఉంది. మెట్రో బ్రాండ్స్‌లో ఆయనకు 14.43 శాతం వాటాతో 39,153,600 షేర్లు ఉన్నాయి. టాటా మోటర్స్‌లో ఆయనకు 1.09 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలో ఆయనకు 36,250,000 షేర్లు ఉన్నాయి. క్రిసిల్‌లో ఆయనకు 5.48 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలో ఆయనకు 40 లక్షల షేర్లు ఉన్నాయి.

ఆకాష్‌ ఎయిర్‌లో పెట్టుబడులు

ఇటీవలే ఆఫరేన్స్‌ ప్రారంభించిన ఆకాష్‌ ఎయిర్‌లో ఝున్‌ఝన్‌వాలాకు వాటాలు ఉన్నాయి. 2022, ఆగస్టు7 ప్రారంభమైన తొలి విమానంలో ఆయన కుటుంబం ముంబై నుంచి ఆహ్మదాబాద్‌కు ప్రయాణించింది. ఇందులో ఆయనకు 40 శాతం వాటా ఉంది. అనేక కంపెనీల్లో ఆయనకు భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ఆయన మరణం పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రధాని సంతాపం

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మొండిపట్టుదల ఉన్న మనిషి, ఆయన జీవితం మొత్తం సరదాతో పాటు, మేథస్సుతోనూ గడిపారని, ఆయన ఆర్ధిక రంగంపై చెరగని ముద్రవేశారని, దేశ పురోగతిని కాంక్షించారని ప్రధాని తెలిపారు. వేలమంది సంపద సృష్టించేందుకు ఆయనే స్ఫూర్తి అని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సంతాపం వ్యక్తం చేశారు. భారత క్యాపిటల్‌ మార్కెట్లకు ఝున్‌ఝున్‌వాలా సేవలు వెలకట్టలేనివని, స్ఫూర్తిమంతమైనవి, చరిత్రను భావితరాలకు ఆయన వదిలివెళ్లారని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement