Thursday, April 25, 2024

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. రాణించిన ఐటీ, ఆటోమొబైల్‌ షేర్లు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రధానంగా ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు లాభాల్లో ముగియడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఐరోపా మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడాయి. చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను చేరుకున్నాయి. 57,297.57 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే పయనించింది. అనంతరం లాభాల్లోకి ఎగబాకి 58,052.87వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 696.81పాయింట్ల లాభంతో 57,989.30వద్ద ముగిసింది. నిఫ్టీ 17,120.40వద్ద ప్రారంభమై చివరకు 197.90పాయింట్లు లాభపడి 17,315.50వద్ద స్థిరపడింది.

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో అత్యధిక వాటా కలిగిన రిలయన్స్‌షేర్లు పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ షేరు ఇంట్రాడేలో 2.3శాతం పుంజుకుని రెండు నెలల గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌, స్మాల్‌క్యాప్‌ 0.28 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ 1.96, నిఫ్టీ ఆటో 1.19శాతం పెరిగాయి. అయితే నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.73శాతం, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ 0.71శాతం తగ్గాయి. టెక్‌ మహీంద్రా నిఫ్టీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. 4.19శాతం పెరిగి రూ.1541.75కు చేరింది. బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి. 1638 కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేయగా 1773కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 30షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో టెక్‌ఎం, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్లలో ఉన్నాయి. హెచ్‌యుఎల్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌ నష్టాల్లో స్థిరపడ్డాయి. మరోవైపు క్రూడ్‌ఆయిల్‌ ధరలు బారీగా పెరిగాయి. బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 117డాలర్లుకు చేరుకోగా డబ్ల్యూటీఐ బ్యారెల్‌ ధర 113డాలర్లుకు చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా పెట్రోధరలు మోత ప్రారంభమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement