Thursday, April 18, 2024

సైజ్‌.. తగ్గుతోంది, స్నాక్స్ పై ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పంజా విసురుతున్నది. దీనికితోడు భౌగోళికంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచేస్తున్నాయి. భారత్‌లోనూ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. దీంతో ప్రతీ వస్తువు ధర పెరుగుతూ పోతున్నది. అయితే.. సబ్బులు, స్నాక్స్‌ ధరలు ఎందుకు పెరగడం లేదని అనుకుంటున్నారా..? లేదండీ.. ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై కూడా పడుతున్నది. ఒక్కప్పుడు 10 రూపాయలకు దొరికే చిప్స్‌, బిస్కెట్‌ ప్యాకెట్స్‌ ఇప్పటికీ అవే ధరలకు దొరుకుతున్నాయి. కానీ వాటి సైజు మారిపోతున్నది. ఇది చాలా మందికి తెలియడం లేదు. బిస్కెట్‌ ప్యాకెట్‌ పరిమాణం అంతే ఉన్నా.. అందులోని బిస్కెట్స్‌ సంఖ్య, చిప్స్‌ ప్యాకెట్‌ సైజ్‌ అంతే ఉన్నా.. అందులోని చిప్స్‌ తగ్గిపోతున్నాయి. ద్రవ్యోల్బణం స్నాక్స్‌ సైజును తగ్గించేస్తున్నాయి. సబ్బులు, డిజర్టెంట్లు, చిప్స్‌ వంటి వాటి బరువులు తగ్గిపోతున్నాయి.
చిరుతిళ్లకు ద్రవ్యోల్బణం
ఈ ద్రవ్యోల్బణం భారత్‌లోని చిరుతిళ్లను కూడా తాకింది. కానీ మనకే తెలియడం లేదు.. కంపెనీలు తాము నష్టపోకుండా.. వాటి బరువులను తగ్గిస్తున్నాయి. ముడి సరుకు ధరలు పెరగడంతో వాటి ధరలు అలాగే ఉన్నా.. బరువుల్లో యాజమాన్యం కోత విధిస్తున్నది. నష్టాల నుంచి తట్టుకోవడానికి అన్ని కంపెనీలు ష్రింక్‌ఫ్లేషన్‌ను ప్రయోగిస్తున్నాయి. యూనిలీవర్‌ కంపెనీలన్నీ తమ నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ వంటి సంస్థలు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఆయిల్‌, గ్రెయిన్స్‌తో పాటు ఇంధన ధరలు పెరగడంతో.. స్నాక్స్‌ ప్యాకేజీలు తేలిక అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి కేవలం భారత్‌లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. సబ్‌ వే రెస్టారెంట్స్‌, డొమినోస్‌ పిజ్జా వంటి సంస్థలు కూడా ధరలు అలాగే ఉంచుతూ.. సైజులు తగ్గిస్తున్నాయి. భారత్‌లో ఏప్రిల్‌ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి చేరుకోగా.. అమెరికా ద్రవ్యోల్బణం ఏకంగా 40 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.
మరో మూడు నెలలు అంతే..
రానున్న మూడు నెలల పాటు ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. హిందుస్థాన్‌ యూనిలీవర్‌కు చెందిన ఉత్పత్తులు 10 మంది భారతీయుల్లో 9 మంది ఉపయోగిస్తుంటారు. క్యు4 ఆర్థిక ఫలితాల సందర్భంగా హెచ్‌యూఎల్‌ కీలక ప్రకటన చేసింది. తాము ఉత్పత్తుల బరువు తగ్గించకుండా.. ధరలు పెంచేందుకు నిర్ణయించినట్టు వివరించింది. ఉదాహరణకు.. ప్రస్తుతం రూ.10 విమ్‌ సబ్బు బరువు 135 గ్రాములుగా ఉంది. అదే సబ్బు మూడు నెలల క్రితం 155 గ్రాములుగా ఉండింది. అంటే ధర తగ్గలేదు కానీ.. బరువు తగ్గింది. దీన్ని చాలా మంది గమనించరు. స్నాక్స్‌లో హల్దిdరామ్‌కు చెందిన ఆలు భుజికా చాలా ఫేమస్‌.. 10 రూపాయల ఆలు భుజియా మూడు నెలల క్రితం 55 గ్రాములు వస్తే.. ఇప్పుడు అదే 10 రూపాయలకు 42 గ్రాములు అందిస్తున్నది. ప్యాకెట్‌ అదే.. ధర అదే.. కానీ అందులో భుజియా మాత్రం తగ్గుతుంది.
ధరలు పెంచుతున్న పలు కంపెనీలు
పెరుగుతున్న ఎడిబుల్‌ ఆయిల్‌ ధరల కారణంగా.. ఆహార కంపెనీలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. నెస్లే ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. పాల ఉత్పత్తుల ధరలు పెరగడమే దీనికి కారణం. డాబర్‌ ఇండియా గ్రామేజ్‌ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. బ్రిటానియా కూడా ఇన్‌పుట్‌ ధరలు పెరగడంతో.. తమ ఉత్పత్తుల బరువును తగ్గిస్తున్నాయి. హెచ్‌యూఎల్‌కు చెందిన రూ.10, రూ.35 లైఫ్‌ బాయ్‌ సబ్బు ధర అంతే ఉన్నా.. గ్రాముల్లో తగ్గించారు. అన్ని కంపెనీలపై ష్రింక్‌ఫ్లేషన్‌ ప్రభావం తీవ్రంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement