Thursday, March 28, 2024

ఇన్ఫోసిస్‌ లిమిటెడ్ సీఈఓగా సలీల్‌ పరేఖ్‌..

ముంబై : దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సర్వీసెస్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ ఆదివారం కీలక ప్రకటన చేసింది. సలీల్‌ పరేఖ్‌ను మళ్లి కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా నియమిస్తున్నట్టు తెలిపింది. మార్చి 2027 వరకు ఐదేళ్ల కాలానికి ఆయనే కంపెనీ సీఈఓ, ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పుకొచ్చింది. శనివారం బోర్డు డైరెక్టర్లు సమావేశమైనట్టు తెలిపింది. ఈ మేరకు రానున్న 5ఏళ్ల కాలానికి సలీల్‌ పరేఖ్‌ పేరును బోర్డు డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు వివరించింది. కంపెనీ నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీ (ఎన్‌ఆర్‌సీ) సలీల్‌ పేరును ప్రతిపాదించింది. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ తెలియపర్చింది. జనవరి 2018లో సలీల్‌ పరేఖ్‌.. ఇన్ఫోసిస్‌ ఐటీ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు సీఈఓతో పాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన్ని మళ్లి రీ అపాయింట్‌మెంట్‌పై కూడా షేర్‌ హోల్డర్లు ఆమోద ముద్ర వేశారు.

చట్టాల ఆధారంగానే నియామకం..

ఈ మేరకు ఇన్ఫోసిస్‌ కీలక ప్రకటన చేసింది. సలీల్‌ పరేఖ్‌కు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌లోని సభ్యులతో ఎలాంటి సంబంధ బాంధ్యవాలు లేవని, సీఈఓతో పాటు ఎండీగా సలీల్‌ను మళ్లి నియమించడంలో ఈ విషయాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఎప్పటికప్పుడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు విడుదల చేస్తున్న ఉత్తర్వులు, ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగానే.. సలీల్‌ పరేఖ్‌ను మళ్లి ఎండీ, సీఈఓగా నియమించినట్టు ఇన్ఫోసిస్‌ కంపెనీ స్పష్టం చేసింది. ఐటీ సర్వీసెస్‌ ఇండస్ట్రీలో సలీల్‌ పరేఖ్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఐటీ సర్వీసెస్‌ కంపెనీల్లో వివిధ హోదాల్లో కూడా పని చేశారన్నారు. ఎంటర్‌ప్రైజెస్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉందని కంపెనీ చెప్పుకొచ్చింది. వ్యాపార రంగంలో కీలక సంస్కరణ చేయడంలో ధిట్ట అని, విజయవంతమైన పనితీరును కనబర్చారంటూ వివరించింది.

క్యాప్‌జెమినీలో కీలక బాధ్యతలు..

ఇన్ఫోసిస్‌ కంపెనీలో అడుగుపెట్టక ముందు సలీల్‌ పరేఖ్‌.. క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్‌ గ్రూప్‌ బోర్డులో సభ్యుడిగా కొనసాగారు. పలు హోదాల్లో సుమారు 25 ఏళ్ల పాటు సేవలు అందించారు. క్యాప్‌ జెమిని భాగస్వామ్య సంస్థ ఎర్న్‌స్ట్ అండ్‌ యంగ్‌లో కూడా కీలక హోదాలో పని చేశారు. ఇన్ఫోసిస్‌ బోర్డు తాజాగా.. షేర్ల కేటాయింపు విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. 1,04,000 షేర్లను ఆరుగురు కీలకమైన మేనేజ్‌మెంట్‌ సభ్యులకు గ్రాంట్‌ చేయగా.. 3,75,760 షేర్లను మరో 88 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కూడా కేటాయించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement