Friday, April 19, 2024

తగ్గిన యాపిల్‌ ఐపాడ్ ఇంపార్టెన్స్​.. తయారీ ఆపేసిన కంపెనీ..

న్యూఢిల్లి : మ్యూజిక్‌ ప్రియులకు ఏదైనా పాట వినాలన్నా.. ఖాళీ సమయాన్ని ఎంజాయ్‌ చేయాలన్నా.. ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ముందుగా గుర్తుకొచ్చేది ఐపాడ్‌.. అందులోనూ.. యాపిల్‌ ఐపాడ్‌కు ఉన్న క్రేజే వేరు.. అయితే ఐపాడ్‌ విషయంలో యాపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మనకు ఈ యాపిల్‌ ఐపాడ్‌లు కనిపించకపోవచ్చు. వీటిలో చివరి వెర్షన్‌ అయిన ఐపాడ్‌ టచ్‌ తయారీని నిలిపివేస్తున్నట్టు యాపిల్‌ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ ముగిసే వరకు విక్రయాలు కొనసాగుతాయని తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్‌లోకి యాపిల్‌ ఐపాడ్‌ వచ్చింది. అప్పటి వరకు వాక్‌మన్‌, రేడియోలు, కంప్యూటర్లలో మాత్రమే పాటలు వినగలిగేవారికి కొత్త అనుభూతి తీసుకొచ్చింది. చేతిలో పట్టుకోగలిగే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరంలో 1000 పాటలను అందించి.. సంగీత ప్రియుల చెవిలో సరిగమలు పలికించింది.

నిలిచిన క్లాసిక్‌ తయారీ..

కాలక్రమంలో యాపిల్‌ ఐపాడ్‌ కే ఫోన్‌ ఫీచర్లను జత చేసి.. ఐఫోన్‌ తీసుకొచ్చింది. ఫలితంగా మ్యూజిక్‌ ఫీచర్లకు మాత్రమే పరిమితమౖౖెన ఐపాడ్‌కు ఆదరణ తగ్గిపోయింది. దీంతో 2014 నుంచే ఐపాడ్‌ల తయారీకి యాపిల్‌ ప్రాధాన్యం తగ్గించింది. ఆ ఏడాదే క్లాసిక్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. 2017లో ఐపాడ్‌ నానో, ఐపాడ్‌ షఫిల్‌ను కూడా తయారీ నుంచి తొలగించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐపాడ్‌ టచ్‌ను ఫోన్‌ ఫీచర్లు లేని ఐఫోన్‌గా అభివర్ణిస్తుంటారు. అలాగే ఐఫోన్‌ చీపర్‌ వెర్షన్‌గానూ చెబుతుంటారు. యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ తొలిసారి మార్కెట్‌కు పరిచయం చేసిన ఈ ఐపాడ్‌ ఒకరకంగా చెప్పాలంటే.. ఆ కంపెనీ చరిత్రను తిరగరాసింది. దాదాపు దివాలా దశకు చేరుకున్న సంస్థలో ఆర్థికపరమైన ఊపిరి నింపి ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారి మూడు ట్రిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న కంపెనీగా నిలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement