Saturday, April 20, 2024

భారీ పెట్టుబడులు లేవు, 16 వేల కోట్ల ఒప్పందాలే.. జులై లావాదేవీల‌పై థోర్న్‌ట‌న్ నివేదిక‌

భారత కార్పోరేట్‌ రంగంలో భారీ ఒప్పందాలు బాగా తగ్గాయి. జులైలో 171 విలీనాలు, కొనుగోళ్లు, ప్రయివేట్‌ ఈక్విటీ ఒప్పందాలు జరిగాయని థోర్న్‌టన్‌ నివేదిక వెల్లడించింది. వీటి మొత్తం విలువ 16వేల కోట్ల రూపాయలు మాత్రమే. విదేశీ లావాదేవీలు, ఒప్పందాల విలువ సంఖ్యాపరంగా గత సంవత్సరం కంటే బాగా తక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఇలా తగ్గడానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణమని పేర్కొంది. భారత్‌లోనూ అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి ఇబ్బందులు ఎదుర్కొంటోందని, రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతుల విలువ పెరిగి భారంగా మారిందని నివేదిక ప్రస్తావించింది.

జులైలో విలీనాలు, కొనుగోళ్ల ఒప్పందాలు 32 జరిగాయి. వీటి విలువ 2,240 కోట్లు. ఒప్పందాల సంఖ్యపరంగా 14 శాతం, విలువ పరంగా 95 శాతం క్షీణత నమోదైందని నివేదిక తెలిపింది. ఎం అండ్‌ ఏ ఒప్పందాల్లో 28 శాతం తో అంకురాలు, ఐటీ రంగాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రంగాల్లో9 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ 1296 కోట్లు. ఒప్పందాల సంఖ్యలో అంకురాలు,ఇ-కామర్స్‌ ఐటి రంగాలు ముందున్నాయి. మౌలిక వసతులు, ఔషధ, రిటైల్‌, బ్యాంకింగ్‌ రంగాలు విలువ పరంగా ముందున్నాయి. జులైలో ఒకేక సంస్థ వంద కోట్ల డాలర్ల క్లబ్‌ యూనికార్న్‌ లో చేరింది. ఫిన్‌టెక్‌ రంగానికి చెందిన వన్‌కార్డ్‌ ఈ ఘనత సాధించింది. జూన్‌తో పోల్చితే ఎం అండ్‌ ఏ ఒప్పందాలు సంఖ్యాపరంగా పెరిగాయి.

విలువ పరంగా తగ్గాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగకపోవడం , చాలా ఒప్పందాల్లో విలువ వివరాలు వెల్లడించకపోవడం ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ప్రయివేట్‌ ఈక్విటీ విభాగంలో 139 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ 13,600 కోట్లు. మొత్తం ఒప్పందాల్లో పీఈ ఒప్పందాల వాటా 80 శాతానికి పైగానే ఉన్నాయి. ఒప్పందాల విలువ మాత్రం గణనీయంగా తగ్గింది. పీఈ విభాగ లావాదేవీల్లో అంకురాల ఆధిపత్యం కొనసాగుతుంది. జులైలో ఈ రంగం నుంచి 70 శాతం వరకు పీఈ ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడుల విలువ 60 కోట్ల డాలర్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. అంకుర రంగంలో 20 శాతం పీఈ ఒప్పందాలతో రిటేల్‌ టెక్‌ విభాగం మొదటి స్థానంలో నిలిచింది. ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫిన్‌టెక్‌ విభాగాలు 18 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు 17 పబ్లిక్‌ ఆఫర్లు వచ్చాయి. ఇష్యూ పరిమాణం 6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2021లో ఇదే కాలంలో 28 పబ్లిక్‌ ఆఫర్‌లు వచ్చాయి. వీటి విలువ 7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాదితో పోల్చితే పబ్లిక్‌ ఇష్యూలు, వాటివి విలువ కూడా ప్రస్తుత సంవత్సరంలో తగ్గాయని నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement