Thursday, April 25, 2024

ఎంజీ మోటార్స్‌పై విచారణ.. ఆర్థిక లోపాలు ఉన్న‌ట్టు గుర్తింపు

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేంద్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అంతకు ముందు చైనాకు చెందిన మొబైల్‌ కంపెనీలు షావోమీ, ఒప్పో, వివో కంపెనీల ఆర్థిక అవకతవకలను గుర్తించిన కేంద్రం వాటిపై విచారణ జరిపింది. ఎంజీ మోటార్స్‌ కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని గుర్తించిన ప్రభుత్వంపై దీనిపై విచారణ ప్రారంభించిందని సంబంధి వర్గాలు వెల్లడించాయి.

చైనాకు చెందిన సియాక్‌ మోటార్స్‌ కార్పొరేషన్‌కు చెందిన ఎంజీ మోటార్స్‌ ఇండియా పేరిట మన దేశంలో కార్ల తయారీ, విక్రయాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఆర్థిక ఫలితాల్లో కొన్ని అవకతవకలను గుర్తించిన అనంతరం కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. కంపెనీ ఆర్థిక కార్యకలాపాల్లో అనుమానిత వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు, పన్ను ఎగవేత, బిల్లుల ఎక్కువ చేసి చూపడం సహా ఇతర అవకతవకలు గుర్తించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన డైరెక్టర్లు, మేనేజింగ్‌ డైరెక్టర్లకు కేంద్రం సమన్లు జారీ చేసినట్లు తెలిసింది.

కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నోటీసులు జారీ చేసినట్లు ఎంజీ మోటార్స్‌ ధృవీకరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ నష్టాలను ప్రకటించడంపై కేంద్రం వివరణ కోరినట్లు కంపెనీ తెలిపింది. ప్రభుత్వ వర్గాలకు కంపెనీ సహకరిస్తుందని, నిర్ధేశితత సమయంలోగా రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కోరిన అన్ని వివరాలను, సమాచారాన్ని అందచేస్తామని తెలిపింది. కంపెనీ ప్రారంభించిన తొలి ఏడాదే లాభాలు నమోదు చేయడం ఏ కంపెనీకి సాధ్యం కాదని పేర్కొంది. ప్రారంభ సంవత్సరంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని తెలిపింది. భారత మార్కెట్‌లో ఉన్న తీవ్రమైన పోటీని తట్టుకుని లాభాలు సాధించడానికి కొంత సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement