Saturday, April 20, 2024

బ్రిటన్‌ను అధిగమించిన భారత్‌.. 5వ ఆర్థిక శక్తిగా అవతరణ

ఆర్థికంగా భారత్‌ ప్రపంచంలో 5వ శక్తిగా అవతరించింది. రెండు వందల సంవత్సరాలు మనల్నీ పరిపాలించిన బ్రిటన్‌ను అధిగమించిన భారత్‌ ఈ ఘనత సాధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకటించింది. కరోనా విసిరిన సవాళ్లను అంతే వేగంగా అధిగమించిన భారత్‌ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుని, వేగంగా వృద్ధి సాధించింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే భారత్‌ ఈ ఘనత సాధించింది. అప్పుడే మన దేశం బ్రిటన్‌ను దాటేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సేకరించిన జీడీపీ గణాంకాల ప్రకారం మన దేశ ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

బ్రిటన్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డ్‌ స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రానున్న రోజుల్లో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అయ్యే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ఈ సంవత్సరం మన కరెన్సీ రూపాయి విలువతో పోల్చితే బ్రిటన్‌ పౌండ్‌ విలువ 8 శాతం క్షిణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్ధిక వ్యవస్థ 7 నుంచి 7.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 8.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. దశాబ్దం క్రితం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం 11వ స్థానంలో ఉంది. బ్రిటన్‌ 5వ స్థానంలో ఉంది. మన దేశం కంటే ముందు అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్‌ మన తరువాత 6వ స్థానంలో ఉంది.

2024 నాటకి బ్రినట్‌ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఇటీవలే హెచ్చరించింది. బ్రిటన్‌లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. అధికార పార్టీలో ప్రధాని అభ్యర్ధి ఎవరన్నదీ సోమవారం నాడు తేలనుంది. రాజీనామా చేసిన ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్స్‌న్‌ స్థానంలో ప్రస్తుత ఆర్ధిక మంత్రి రిషీ సునక్‌, విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ ట్రూస్‌ మధ్య గట్టి పోటీ ఉంది. ముందస్తు అంచనాల ప్రకారం లిజ్‌ ట్రూస్‌నే గెలుపొందే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎవరు ప్రధాని అయిన తక్షణమే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కర్మ సిద్ధాంతం పని చేసింది : ఆనంద్‌ మహీంద్రా

బ్రిటన్‌ను మన దేశం దాటేసి ఆర్థిక శక్తిగా ఎదగడంపై పలువురు మేథావులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌ లో తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. బ్రిటన్‌ వలస రాజ్యంగా మన దేశం ఇప్పుడు దాన్నే దాటి ముందుకు వెళ్లడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని వీరు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించారు. వార్త కథనాన్ని షేర్‌ చేస్తూ కర్మ సిద్ధాంతం పని చేసింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కష్టపడి పోరాడి, త్యాగాలు చేసిన ప్రతి భారతీయుడి హృదయం ఈ వార్తతో ఒప్పొంగిపోతుంది. అంతేకాక, భారత్‌ గందరగోళంలో పడిపోతుందని భావించిన అందరికీ ఇదో గట్టి సమాధానం అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కొటక్‌ మహీంద్రా సీఈఓ ఉదయ్‌ కొటక్‌ కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఇది గర్వించదగిన క్షణమని పేర్కొన్నారు. తలసరి డీజీపీలో మన కంటే బ్రిటన్‌ ఇంకా చాలా ముందుందని, మనం సాధించాల్సింది చాలా ఉందని ఆయన ట్విట్‌ చేశారు. వేదాంతా రిసోర్సెస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ స్పందిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ మెచ్చుకోదగ్గ మైలురాయిని చేరుకుందని, ఐదో ఆర్థిక శక్తిగా ఎదగడం అభినందనీయమని, మరికొన్ని సంవత్సరాల్లోనే టాప్‌ 3లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

మూడో స్థానానికి వస్తుందన్న ఎస్‌బీఐ

ప్రస్తుత ఆర్థిక వృద్ధిరేటు కొనసాగితే మన దేశం 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్‌ను అధిగమించి 3వ స్థానానికి చేరకుంటుందని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. 2014లో డీజీపీ పరంగా మన దేశం ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 6.7 నుంచి 7.7 వరకు ఆర్ధిక వృద్ధిరేట్లు ఉంటుందని అంచనాలు ఉన్నప్పటికీ, 6 నుంచి 6.5 శాతం వరకు ఉంటుందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. ఈ వృద్ధిరేటు కొనసాగితే ప్రస్తుతం ఉన్న తలసరి ఆదాయంలోనూ మార్పులు వస్తాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement