Friday, April 19, 2024

జీఎస్‌టీ వసూళ్లు 1.47 లక్షల కోట్లు.. వరసగా ఏడునెలలుగా ఇదే జోరు

జీఎస్‌టీ వసూళ్లు సెప్టెంబర్‌లో 26 శాతం పెరిగి 1.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, జీఎస్‌టీ పన్ను రేట్లు ఎక్కువగా ఉండటంతో వసూళ్లు పెరిగాయి. వరసగా ఏడు నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు 1.4 లక్షల కోట్లకు పైగా వసూలు అవుతున్నాయి. జీఎస్‌టీ వసూళ్ల వివరాలను ఆర్ధిక శాఖ శనివారం నాడు విడుదల చేసింది. వసూలైన మొత్తంలో సీజీఎస్‌టీ 25,271 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ 31,813 కోట్లు, ఐజీఎస్‌టీ 80,464 కోట్లు ఉన్నాయి. ఐజీఎస్‌టీలో 41,215 కోట్లు దిగుమతి చేసుకున్న వస్తువులపై వచ్చిన జీఎస్‌టీ వసూళ్లు ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై వచ్చిన 856 కోట్లు కలిపి మొత్తం సెస్‌ వసూళ్లు 10,137 కోట్లు వచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు 1.43 లక్షల కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రికార్‌ ్డ స్థాయిలో 1.67 లక్షల కోట్లు వచ్చింది.

గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలతో పోల్చుకుంటే ఈ సెప్టెంబర్‌లో 27 శాతం అధికంగా జీఎస్‌టీ వసూలైంది. ఆగస్టు నెలలో 770 లక్షల ఇ-వే బిల్స్‌ జారీ చేసినట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. సెప్టెంబర్‌ 20 వతేదీ ఒక్కరోజే రికార్డ్‌ స్థాయిలో 49,453 కోట్లు రూపాయిల జీఎస్‌టీ వసూలైంది. జీఎస్‌టీ సెటిల్‌మెంట్స్‌ తరువాత కేంద్ర ప్రభుత్వానికి 57,151 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు 59.216 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత నెలలో దిగుమతుల ద్వారా ఆదాయం 39 శాతం పెరిగిందని, దేశీయ లావాదేవీల ఆదాయం 22 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో …

తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వసూళ్లు 12 శాతం పెరిగాయి. తెలంగాణలో 2021 సెప్టెంబర్‌లో 3,494 కోట్లుగా ఉన్న వసూళ్లు, ఈ సెప్టెంబర్‌లో 3,915 కోట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్‌టీ వసూళ్లలో 21 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 2,595 కోట్లు వసూలైతే, ఈ సారి 3,132 కోట్లు వసూళ్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement