Friday, April 26, 2024

ఫార్మాసిటీ ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌.. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న‌ 300 ఫార్మా కంపెనీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ ఈ ఏడాది చివరికి ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దసరాకు ప్రారంభమవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని పరిశ్రమల శాఖ, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ) ఉన్నతాధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రాయానికి అతి 40 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల , కందుకూరు తదితర పలు మండలాల్లోని 20 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని టీఎస్‌ఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఫార్మాసిటీ మొదటి దశ ప్రారంభానికి అవసరమైన సుమారు 10 వేల ఎకరాల భూ సేకరణ ఇప్పటికే పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ భూమికి సంబంధించి అభివృద్ధి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే ఫార్మాసిటీ తొలి దశను లాంఛనంగా ప్రారంభించిన తర్వాతే అక్కడ కంపెనీలకు భూముల కేటాయింపు ప్రారంభమవనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తంతు మొత్తం ముగిశాకే ఫార్మాసిటీ రెండో దశ భూ సేకరణ ప్రారంభమవనున్నట్లు తెలుస్తోంది.

తొలి దశ భూ కేటాయింపులకు కంపెనీల నుంచి ఫుల్‌ డిమాండ్‌…

ఫార్మాసిటీ తొలి దశ ప్రారంభమైన తర్వాత కంపెనీలకు భూ కేటాయింపులు జరపడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫార్మాసిటీ ప్లాట్ల కోసం మల్టిd నేషనల్‌ కంపెనీల(ఎంఎన్‌సీ) నుంచి మొదలుకుని లోకల్‌ మిడ్‌ సైజ్‌ ఫార్మా కంపెనీల దాకా టీఎస్‌ఐఐసీ వద్ద క్యూ కట్టినట్లు తెలుస్తోంది. సుమారు 300 కంపెనీల దాకా భూముల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

భూ సేకరణ కోసం సుమారు రూ.2వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం…

ఫార్మాసిటీకి అవసరమైన తొలి దశ పది వేల ఎకరాలు సేకరించేందుకుగాను ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. టీఎస్‌ఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా రెవెన్యూ శాఖ నష్టపరిహారం చెల్లించి సంబంధిత గ్రామస్తుల నుంచి భూములు సేకరించింది. అయితే ఈ భూ సేకరణకు సంబంధించి పలువురు కోర్టుకెళ్లడంతో వివాదాలు తలెత్తడంతో వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మాసిటీ ఒకసారి ప్రారంభమైన తర్వాత రంగారెడ్డి జిల్లా ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుందని, వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఫార్మాసిటీలోని కంపెనీల వల్ల ఎలాంటి చుట్టుపక్కల గ్రామాలకు ఎలాంటి కాలుష్యం లేకుండా జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు టీఎస్‌ఐఐసీ చెబుతుండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement