Wednesday, April 24, 2024

పెట్టుబడులకు భాగ్యనగరం అనుకూలం.. కాల్‌అవే గోల్ఫ్‌ డిజిటెక్‌ సెంటర్‌
ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పెట్టుబడులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పించడంలో.. హైదరాబాద్‌ దేశంలోనే అత్యుత్తమ నగరమని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. గురువారం హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన ”కాల్‌ అవే” గోల్ఫ్‌ సంస్థ డిజిటెక్‌ సెంటర్‌ కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. రూ.150 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పించేలా ”కాల్‌ అవే” సంస్థ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ ”కాల్‌ అవే” కంపెనీ తన డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటుకు సరైన నగరాన్ని ఎంచుకుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి కంపెనీలు ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. ”కాల్‌ అవే” లాంటి టాప్‌గోల్ఫ్‌ కంపెనీ హైదరాబాద్‌కు వస్తే.. అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ”హైదరాబాద్‌లో ”కాల్‌ అవే” సంస్థ కార్యాలయం ఏర్పాటు సంతోషం. తెలంగాణలో డిజిటెక్‌ కంపెనీలు చాలా ఉన్నాయి. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. ఆ కంపెనీ రెండో అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉంది. మౌలిక వసతుల్లో హైదరాబాద్‌ దేశంలోని ఇతర నగరాల కంటే ముందుంది. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. ”కాల్‌ అవే” కూడా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాం” అని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాం: కాల్‌అవే సీనియర్‌ వీపీ సాయి కూరపాటి

అమెరికా తర్వాత చాలా చర్చల అనంతరం ఇండియాలో కార్యాలయం పెట్టాలనుకున్నామని ”కాల్‌ అవే” సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయి కూరపాటి తెలిపారు. హైదరాబాద్‌లో మంచి సౌకర్యాలున్నాయని తెలుసుకుని ఇక్కడే ఈ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇక్కడి సదుపాయాలు చూసిన తర్వాత భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే సూచన కనిపిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ”కాల్‌ అవే” గోల్ఫ్‌ కంపెనీ అధికారులు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement