Tuesday, October 8, 2024

పెట్రోల్‌ వాహన ధరలకే ఈవీలు.. హోండా కొత్త ప్లాన్‌

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తామని హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రకటించింది. తొలి వాహనాన్ని మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో తీసుకొస్తామని తెలిపింది. రెండో మోడల్‌ స్వపబుల్‌ బ్యాటరీ ఉండేలా రూపొందిస్తామని పేర్కొంది. ఆ తర్వాత మార్కెట్‌లో డిమాండును బట్టి కొత్త మోడళ్లను తీసుకొస్తామని తెలిపింది. తొలి వాహనం 2024లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవీలు స్కూటర్‌ విభాగంలోనా లేక మోటార్‌ సైకిల్‌ విభాగంలో అనేది వెల్లడించలేదు. అలాగే ఏటా పది లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని 2030 నాటికి అందుకుంటామని హెచ్‌ఎంఎస్‌లు అధ్యక్షుడు ఒగాటా తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఈవీలకు కావల్సిన మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీటిని సొంతంగా ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈవీల తయారీ బ్యాటరీల ఖర్చే అధికంగా ఉంటుదన్నారు. మొత్తంగా వాహనాల ధర దీనిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాయితీ లేకుండా తక్కవ ధరలో ఈవీలను అందించడం సవాల్‌తో కూడుకున్న అంశమని అభిప్రాయపడ్డారు.

తాము తీసుకురాబోయే విద్యుత్‌ ద్విచక్రవాహనాలు డిజైన్‌, టెక్నాలజీ పరంగా ప్రత్యేకంగా ఉంటాయని ఒగాటా తెలిపారు. అదే విధంగా ధర సైతం పెట్రోల్‌తో నడిచే ధరలకు దగ్గరగా ఉంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వాహన ఛార్జింగ్‌ కోసం 6,000 టచ్‌పాయింట్లను సైతం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. భారత్‌ నుంచి ఇతర దేశాలకూ విద్యుత్‌ వాహనాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళీకలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement