Saturday, April 20, 2024

మార్కెట్‌ వరుస నష్టాలకు బ్రేక్‌, లాభాల్లో దేశీయ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస నష్టాలకు సోమవారం బ్రేక్‌ పడింది. జాతీయ, అంతర్జాతీయ కీలక పరిణామాలు సూచీలను లాభాల్లో పయనించేలా చేశాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,472.72 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకుని మధ్యాహ్నం వరకు అదే బాటలో పయనించాయి. తరువాత పుంజుకుని 57,638.34 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసుకుంది. చివరికి 231.29 పాయింట్ల లాభంతో.. 57,593.49 పాయింట్ల వద్ద ముగిసింది. 17,181.85 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరికి 69 పాయింట్లు లాభపడి.. 17,222 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నది. సెన్సెక్స్‌ 30 షేర్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, ఇండ్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాలు తెచ్చిపెట్టాయి. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మినహా మిగిలిన రంగాల సూచీలు అన్నీ లాభాల్లో పయనించాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ సోమవారం రూ.42.64 వేల కోట్లు పెరిగి.. రూ.2,60,27,425.83 కోట్లకు చేరుకుంది.

పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ ర్యాలీ
పీవీర్‌, ఐనాక్స్‌ మల్టిప్లెక్సులు విలీనం అవుతున్నాయన్న వార్తతో రెండు కంపెనీల షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. శుక్రవారం పీవీఆర్‌ షేరు ధర రూ.1,821 వద్ద క్లోజ్‌ అయ్యింది. సోమవారం 10 శాతం మేర లాభపడి.. 2010.35కు చేరుకుని.. 52 వారాల గరిష్టాన్ని చేరుకుంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 3.38 శాతం (రూ.61.65) లాభపడి.. రూ.1,883.30 వద్ద ముగిసింది. అదేవిధంగా ఐనాక్స్‌ లీజర్‌ షేరు ధర కూడా భారీగా పెరిగింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఐనాక్స్‌లీజర్‌ షేరు ధర రూ.469.70గా ఉండింది. సోమవారం మార్కెట్‌ ఓపెన్‌ అవ్వగానే.. ఏకంగా 20 శాతం మేర లాభపడి.. రూ.566.60 నమోదై.. 52 వారాల గరిష్టానికి చేరుకుంది. చివరికి మార్కెట్‌ ముగిసే సమయానికి 11.32 శాతం (రూ.53.15) లాభపడి.. రూ.522వద్ద ముగిసింది.

ర్యాలీకి ఇవీ కారణాలు
లాభాల్లో ప్రారంభమైన కొద్ది సమయానికే నష్టాల్లో జారుకుని.. చివరికి ప్రాఫిట్‌తోనే సూచీలు ముగించాయి. అయితే దీనికి జాతీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా విమానయాన సర్వీసులు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన మార్కెట్‌కు బలాన్ని ఇచ్చాయి. అదేవిధంగా ద్రవ్యోల్బణ కట్టడి – ద్రవ్యలభ్యతకు ఆర్‌బీఐ హామీ వంటి దేశీయ పరిణామాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. మరోవైపు ఈ వారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌కు వస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చమురు రంగానికి కొంత మేలు చేస్తున్న ఆలోచన కూడా సూచీలు లాభాల్లో ముగిసేందుకు కారణం అయ్యాయి. రాయితీ ధరతో చమురు సరఫరా, రూపాయి-రూబుల్‌లో చెల్లింపులు వంటి అంశాలపై చర్చించనున్నారనే వార్తలు భారతీయ మార్కెట్లకు సానుకూలంగా నిలిచాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నా.. మరోసారి టర్కీలు శాంతి చర్చలు జరిపేందుకు ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించాయి. ఈ పరిణామం కూడా మార్కెట్లను లాభాల్లోకి వెళ్లేందుకు సహకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement