Friday, November 8, 2024

Business – లగ్జరీ విల్లా కొంటే లాంబోర్గినీ ఫ్రీ

బంపర్‌ ఆఫర్ ఇచ్చిన రియల్‌ సంస్థ
నోయిడాలో ప్రీమియం విల్లాలు
₹51 లక్షల నుంచి ప్రారంభ ధర
₹30 కోట్ల వరకూ ఫైనల్​ రేంజ్​
₹26 కోట్లకు మించిన విల్లా కొంటేనే ఆఫర్​
₹4 కోట్ల కారు ఫ్రీ ఇస్తామన్న రియల్టర్​
సోషల్​ మీడియాలో హాట్​ హాట్​ కామెంట్స్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ లగ్జరీ విల్లాలను కొనుగోలు చేసిన వారికి ఇటలీకి చెందిన సూపర్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లాంబోర్గిని కారును కాంప్లిమెంటరీ కింద అందజేయనున్నట్లు తెలిపింది. నోయిడాలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ అయిన జేపీ గ్రీన్స్ .. గ్రేటర్‌ నోయిడాలో 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే, 6 బీహెచ్‌కే సహా పలు విల్లాలను నిర్మించింది. వీటి ధరలు ₹51 లక్షల నుంచి ₹30 కోట్ల వరకూ ఉన్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆఫర్‌ను కూడా ప్రకటించారు.

ప్రీమియం విల్లాలు..

ఈ మేరకు రియల్టర్‌ గౌరవ్‌ గుప్తా తమ సంస్థ నిర్మించిన అల్ట్రా– ప్రీమియం విల్లాలను కొనుగోలు చేసే వారికి సోషల్‌ మీడియా వేదికగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ₹26 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విల్లాను కొంటే ₹4 కోట్ల కంటే ఎక్కువ విలువైన కాంప్లిమెంటరీ లాంబోర్గినీ ఉరస్​ని ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, ₹26 కోట్లు కేవలం బేస్‌ విల్లాకు మాత్రమే లెక్క.. అదనపు సౌకర్యాలతో కలిపి దీని ధర ₹27 కోట్లకు పైనే ఉంటుంది. బేస్‌ విల్లా కోసం ₹26 కోట్లు పెట్టగా.. పార్కింగ్‌ కోసం ₹30 లక్షలు, పవర్‌ బ్యాకప్‌ కోసం ₹7.5లక్షలు, క్లబ్‌ మెంబర్‌షిప్‌ కోసం మరో ₹7.4 లక్షలు కట్టాల్సి ఉంటుంది.

గోల్ఫ్​కోర్టు వ్యూ కావాలంటే..

- Advertisement -

ఇక.. గోల్ఫ్‌ కోర్ట్‌ వ్యూతో విల్లా కోరుకుంటే మాత్రం మరో ₹50 లక్షలు అదనంగా పే చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో విల్లా ధర ₹26.95 కోట్ల నుంచి ₹27.45 కోట్ల దాకా ఉంటుంది. ఇంత ఖర్చు చేస్తేనే లాంబోర్గినీ కారు కాంప్లిమెంటరీ కింద ఇస్తారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రకటించిన ఈ ఆఫర్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రియల్టర్‌ పెట్టిన ట్వీట్స్‌పై నెటిజన్లు హాట్ హాట్‌గా రియాక్ట్ అవుతున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement