Friday, October 4, 2024

అమెరికా, చైనా మన తర్వాతే.. ఆ విషయంలో ఇండియా టాప్

భారతదేశంలో పెరుగుతున్న సంపన్నశ్రేణి మూలంగా, హై ఎండ్‌ మద్యం విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. స్కాచ్‌ విస్కీ, ఫైన్‌ వైన్‌ విక్రయాలు రెండంకెల వృద్ధిని చేరాయి. ఈ క్రమంలో అమెరికా, చైనా విక్రయాలను దాటేశాయని స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.

ఖరీదైన మద్యం బ్రాండ్ల వినియోగంలో చైనాను భారతదేశం అధిగమించింది. ఐదేళ్ల సీఏజీఆర్‌లో యూఎస్‌ కంటే రెట్టింపు రేటుతో వృద్ధిచెందుతున్న బ్రాండ్‌గా స్కాచ్‌ లగ్జరీ విస్కీ నిలిచిందని జ్యూరిచ్‌లోని సీనియర్‌ లగ్జరీ బ్రాండ్‌ బిల్డర్‌ సైమన్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. గ్లియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో జోసెఫ్‌ సీనియర్‌ పరిశోధకుడు.

వివిధ డేటా అంచనాల ప్రకారం, లగ్జరీ స్కాచ్‌, విస్కీ మార్కెట్‌ 2024 చివరి నాటికి 16శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతున్నది. 2022 వరకు భారత్‌కు స్కాచ్‌ విస్కీ ఎగుమతులు 66శాతం వార్షిక పెరుగుదలను చూశాయి. ఇది అమెరికా, చైనా, ఇతర ప్రధాన మార్కెట్లను అధిగమించిందని యూకే ఆధారిత స్కాచ్‌ విస్కీ అసోసియేషన్‌ డేటాను ఉదహరిస్తూ జోసెఫ్‌ చెప్పుకొచ్చారు.

ఇక విలువ పరంగా స్కాచ్‌ విస్కీలో యూఎస్‌దే అగ్రస్థానం. అయితే, ఇప్పుడు బాటిళ్లపరంగా భారత్‌ అతిపెద్ద వినియోగదారుగా ఆవిర్భవించింది. ఇక స్కాచ్‌ అతిపెద్ద ఎగుమతి దారుగా స్కాట్లాండ్‌ నిలిచింది. స్కాచ్‌ లగ్జరీ విస్కీకి భారతదేశం ఐదవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తోందని జోసెఫ్‌ విశ్లేషించారు.

ఫ్రాన్స్‌, సింగపూర్‌, తైవాన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదే సమయంలో వైన్‌ విక్రయాలు 22.8 శాతం సీఏజీఆర్‌ వృద్ధిని సూచిస్తున్నాయి. 2024 హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం, భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాది కంటే 75 మంది పెరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement