Friday, April 19, 2024

మీషో పండగ విక్రయాల్లో 68శాతం వృద్ధి

ఫెస్టివ్‌ సీజన్‌లో మీ షో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఈనెల 23-27 మధ్య జరిగిన ఐదు రోజుల ప్రత్యేక పండగ సేల్‌లో విక్రయాలు 68 శాతం పెరిగాయని మీషో తెలిపింది. దాదాపు 3.34 కోట్ల ఆర్డర్లు అందినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే నాలుగురెట్లు పెరిగాయి. వీటిలో 80 శాతం టైర్‌-2 పట్టణాల నుంచి వచ్చాయని పేర్కొంది. వినియోగదారుల్లో దాదాపు 60 శాతం మొదటిసారి ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు వచ్చినవారే కావడం విశేషం. ఉనా (హిమాచల్‌ ప్రదేశ్‌), చీమకుర్తి (ఆంధ్రప్రదేశ్‌) కలింపాంగ్‌ (ప.బెంగాల్‌) భారుచ్‌ (గుజరాత్‌) వంటి చిన్న పట్టణాల నుంచి విశేషంగా ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది.

ఇక ఫెస్టివ్‌ సేల్‌ సందర్భంగా విక్రేతలకు జీరో పర్సెంటేజీ కమిషన్‌ను మీషో ఆఫర్‌ చేసింది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ వర్గాలకు దాదాపు రూ.104 కోట్లు ఆదా అయిందని తెలిపింది. పండగ విక్రయాల్లో ప్రధానంగా వంట గదిలో ఉపయోగించే వస్తువులకే మంచి డిమాండ్‌ లభించింది. ఈ కేటగిరీ విక్రయాల్లో 116 శాతం వృద్ధి నమోదైందని మీషో పేర్కొంది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాల్లో 109 శాతం, లగేజీ ప్రయాణ సంబంధిత వస్తువుల విక్రయాలు 99 శాతం పెరిగాయని వెల్లడించింది. తదుపరి సేల్‌ ఆఫర్‌ దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 7-11 తేదీల మధ్య జరగనున్నట్లు స్పష్టంచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement