Wednesday, November 6, 2024

Apple | ఇండియాలోనే 25 శాతం ఐఫోన్ల తయారీ

యాపిల్‌ భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను మరింత వేగంగా విస్తరించనుంది. త్వరలోనే సంస్థ దేశంలో మరో నాలుగు కొత్త యాపిల్‌ ఉత్పత్తుల స్టోర్లను ప్రారంభించనుంది. కంపెనీ ఇప్పటికే ముంబై, న్యూఢిల్లిల్లో సొంత స్టోర్లను ఏర్పాటు చేసింది. కస్టమర్ల నుంచి ఈ స్టోర్లకు మంచి ఆదరణ లభిస్తుండడంతో మరో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది.

భారత్‌లో తమ స్టోర్లను పెంచనున్నట్లు యాపిల్‌ రిటైల్‌ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌ డీర్‌డ్రే ఓబ్రియన్‌ తెలిపారు. కంపెనీ కొత్తగా
బెంగళూర్‌, పూణే, ఢిల్లి-ఎన్‌సీఆర్‌, ముంబైలో ఈ కొత్త స్టోర్లను ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు. కొత్త వాటితో ఢిల్లి, ముంబైల్లో యాపిల్‌ స్టోర్ల సంఖ్య రెండుకు పెరగనుంది.

ఐఫోన్ 16 సిరీస్‌ ఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించనున్నట్లు డీర్‌డ్రే ఓబ్రియన్‌ తెలిపారు. యాపిల్‌ ప్రకటనతో త్వరలోనే మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.

రానున్న కాలంలో మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో 25 శాతం భారత్‌లోనే చేయాలని యాపిల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఐఫోన్‌ 16 సిరీస్‌, మేడ్‌ ఇన్‌ ఇండియా ఫోన్లు ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యాపిల్‌ కంపెనీ 2017 నుంచి భారత్‌లో యాపిల్‌ ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. 2023 ఏప్రిల్‌ నెలలో కంపెనీ ముంబై, ఢిల్లిలో మొదటిసారిగా రెండు స్టోర్లను ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement