Friday, March 29, 2024

ఇన్సూరెన్స్ సంస్థలకు కొత్త గైడ్‌లైన్స్

దేశంలోని ఇన్సూరెన్స్ సంస్థలకు IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నిబంధనలు విడుదల చేసింది. పాలసీదారులతో సంబంధాలు కొనసాగించి ప్రామాణిక పద్ధతిలో సమాచారం అందించడానికి పాలసీదారులకు నిర్దిష్ట వ్యవధిలో నోటీసులు పంపించాలని నిబంధనల్లో పేర్కొంది. ఆరోగ్య బీమాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాలసీదారులకు తెలియజేయాలని సూచించింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చర్యలు ప్రారంభించాలని కోరింది. కాగా 2021, జూన్ 1 లోపు ఈ సూచనలను అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

పాలసీ సంఖ్య, బీమా సమాచారం, పాలసీ వ్యవధి, కవరేజీ పరిధి, పాలసీ పరిధిలో ఉన్న బీమా వ్యక్తుల సంఖ్య, సెటిల్ చేసిన క్లెయిమ్‌ల మొత్తం, బోనస్ వివరాలను పాలసీదారుడికి ఇన్సూరెన్స్ సంస్థలు తప్పనిసరిగా అందించాలి. సమాచారం పునరుద్ధరణ, ప్రీమియం చెల్లింపు వ్య‌వ‌ధి, పునరుద్ధరణకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం, గ్రేస్ పీరియడ్, సంప్రదింపుల వివరాలు, బీమా సంస్థ, పాలసీదారు సంబంధిత సేవ, టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీ వంటివి చేర్చాలి. పాలసీదారులకు సంవత్సరానికి ఇన్సూరెన్స్ సంస్థలు రెండు సార్లు సమాచారం ఇవ్వాలి. అంటే పాలసీ జారీచేసిన ఆరు నెలల తరువాత, పునరుద్ధరణ గడువు తేదీకి కనీసం ఒక నెల ముందు ఈ వివరాలు తెలియజేయాలి. IRDAI సర్క్యులర్ ప్రకారం ఇన్సూరెన్స్ సంస్థలు సమాచారాన్ని తెలియజేయడానికి ఈ-మెయిల్ లేదా వాట్సాప్ లేదా లేఖలు రాయడంలో ఏదైనా కమ్యూనికేషన్ ప‌ద్ధ‌తిని ఎంచుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement