Wednesday, March 27, 2024

రాష్ట్రంలో అన్ని గోతులే.. ఎంపీ రఘురామ సెటైర్లు

ఏపీ సీఎం జగన్ కు పలు అంశాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రోజుకో లేఖ పంపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని వివరిస్తూ లేఖలో తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. రాజుగారి ఇంటికి అడ్రస్ చెబుతారా..? అంటూ ప్రారంభించి.. ‘’ఇక్కడి నుంచి నాలుగు గోతులు దాటాక కుడివైపు తిరిగితే.. మరో పది గోతులు కనిపిస్తాయి.. అవి దాటాక పెద్ద గొయ్యి వస్తుంది. ప్యాంట్ పైకి లాగి ఎడమవైపు తిరుగు ఆరు గోతులు ఉంటాయి.. వాటిని దాటి ముందుకెళ్తే కరెంట్ స్తంభం ఉంటుంది. దాని పక్కనే రాజుగారి ఇల్లు. ఆ కరెంట్ స్తంభం ముట్టుకోకు.. స్తంభింపజేస్తుంది కరెంటు పాస్ అవుతుంది’’ అంటూ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సెటైర్ వేశారు.

ఏపీలో రహదారులన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయని… వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రఘురామ లేఖలో తెలిపారు. వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. బ‌తుకు బండి లాగ‌డ‌మే క‌ష్టంగా ఉన్న ఈ రోజుల్లో రోడ్డు మీద బండి తోల‌డం మ‌రింత సంక్లిష్టంగా త‌యారైంద‌న్నారు. మరమ్మతులు చేయని కారణంగా రహదారుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కోస్తా తీర ప్రాంతాలలో రోడ్లు కొట్టుకుపోయి యమకూపాలుగా మారాయన్నారు. సీఎం కొంత కాలం పాటు హెలికాప్టర్లు, విమానాలలో ప్రయాణం చేయవద్దని.. త్వరలో ప్రారంభించే రచ్చబండ కార్యక్రమానికి రోడ్డు మార్గంలో వెళ్లాలని రఘురామ సూచించారు. అలా వెళితే మీ పాలనలో రోడ్లు ఎంత బాగున్నాయో మీరే కనులారా వీక్షించవచ్చని రఘురామ లేఖలో పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. కొత్త కేసులు ఎన్నంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement