Wednesday, April 24, 2024

TDP-YSRCP: కొండపిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో తెదేపా ఎమ్మెల్యే

టంగుటూరు: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైకాపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ సుమారు 350 మంది పోలీసులు మోహరించారు..

మరోవైపు వైకాపా తీరును నిరసిస్తూ తెదేపా నేతలు ప్రతిస్పందిస్తూ.. టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు బయల్దేరగా.. మార్గంమధ్యలో 16వ నంబర్‌ హైవేపై పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement