Thursday, March 28, 2024

వైసిపిలో మండ‌లి టిక్కెట్ల జాత‌ర‌..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : అధికార వైసీపీలో శాసనమండలి టిక్కెట్ల సందడి మొదలైంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల కోటా నుంచి టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకా కుళం జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నా యి. ప్రస్తుతం ఆ స్థానాల్లో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారికి మార్చి 29తో ముగ్గు రికి, మే నెలలో మరో ఐదు మందికి పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణ యం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరిగే 8 స్థానిక సంస్థల స్థానాలన్ని అధికార వైసీపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపి స్తున్నాయి. దీంతో వైసీపీలో గత వారం రోజులుగా టిక్కెట్ల సందడి కనిపిస్తుంది. ఆయా జిల్లాల నుంచి టిక్కెట్లు ఆశించే వారంతా తాడేపల్లిలో మకాం వేసి ముమ్మ ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సామా జిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యతను కల్పించాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారు. ఆ దిశగానే జాబితాను కసరత్తు చేస్తున్నట్లో తెలుస్తోంది. అందుకు సంబంధించి శుక్రవారం తాడేపల్లిలో కీలక సమావేశం కూడా జరిగింది. అయితే తుది జాబితా సోమవారం అధికారికంగా ప్రకటించనున్న నేపధ్యంలో ఆయా జిల్లాల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా జాబితాలో తమకు స్థానం దక్కేలా గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సామాజిక వర్గాల వారీగా కేటాయించే యోచన
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యతను కల్పిస్తూ ఎంపిక చేయాలని సీఎం జగన్‌ యోచిస్తూ ఆ దిశగానే జాబితాను సిద్ధం చేస్తున్నారు. అయితే రాయలసీమ 4 జిల్లాల్లో రెండు జిల్లాలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన రెండు స్థానాల్లో ఒక స్థానం మైనారిటీకి, మరో స్థానం బీసీలకు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆర్యవైశ్యులకు కేటాయించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే సందర్భంలో ఎస్సీ సామాజిక వర్గానికి నెల్లూరు స్థానాన్ని కేటాయిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు, కమ్మ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మహిళకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా నుంచి ఏపీ అగ్రి చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌, డిప్యూటి మేయర్‌ కె. విజయభాస్కర్‌రెడ్డిలతో పాటు బీసీ సామాజిక వర్గానికి మరో మహిళ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే నవీన్‌ నిశ్చల్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కడప జిల్లా నుంచి మాజీ మంత్రి, సీనియర్‌ నేత పి. రామసుబ్బారెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. సీఎం జగన్‌ రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన సందర్భంలో ఆయన్ను నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి విశ్రాంత ఐపీఎస్‌ అధికారి రెడ్డెప్పరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే జిల్లా నుంచి మరికొన్ని పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. అలాగే కర్నూలు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే డి. పార్ధసారధిరెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన మరో సీనియర్‌ నేత ఈ. రామపుల్లారెడ్డి, నంద్యాలకు చెందిన మరో సీనియర్‌ నాయకుడు గోపాల్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నీలకంఠం నాయుడు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.డి పద్మావతి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్‌ నేత కారుమంచి రమేష్‌ ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసే నాయకుడిగా సీఎం జగన్‌ వద్ద కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే మెట్ట ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా కారుమంచికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే జిల్లా నుంచి జయమంగళ వెంకటరమణ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. అధిష్టానం ఆయన పేరును కూడా పరిశీలిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి కె. సూర్యనారాయణ పేరు దాదాపు ఖరారైందని చెబుతున్నారు.

నెల్లూరు నుంచి ఆర్యవైశ్యులకు అవకాశం
నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఆర్యవైశ్య కోటాలో నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాధ్‌కు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టాన పెద్దలు ఆ దిశగా ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని నరసింహకొండ వద్ద జరిగిన ఆర్యవైశ్య రాష్ట్ర స్థాయి సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ముక్కాల ద్వారకానాధ్‌కు చట్ట సభల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి ఆ సామాజిక వర్గానికి అవకాశం లభించలేదు. ఈ నేపధ్యంలోనే ఆయనకు నుడా చైర్మన్‌గా కీలక పదవీ కట్టబెట్టారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సామాజిక వర్గాల వారీగా ఆర్యవైశ్యులకు ఒక స్థానాన్ని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ముక్కాల ద్వారకానాధ్‌ పేరు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మేరిగ మురళి పేరు కూడా వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం కింద ఆయనకు అవకాశం కల్పిస్తారన్న ప్రచారం కూడా జిల్లాలో సాగుతోంది. అయితే ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన గూడూరు ప్రాంతానికి చెందిన నాయకులు బల్లి కళ్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీగా సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. దీంతో ద్వారకానాధ్‌కే జాబితాలో చోటు దక్కుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇదే జిల్లా నుంచి రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మరికొంత మంది పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement