Tuesday, April 23, 2024

సీన్ రివ‌ర్స్ – భూమా కుటుంబంపై వైసిపి ఫోక‌స్

అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయలసీమ జిల్లాల్లో పూర్తి మెజారిటీ సాధించే దిశగా ఆచితూచి అడుగులు వేస్తోంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంగ, అర్థ బలాలను బలహీనపరచటంతో పాటు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించే అభ్యర్థులను అన్వేషిస్తోంది.. ఈ విషయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన సీనియర్లయిన అభ్యర్థులైనా సరే గెలుపు అవకాశాలు ఉన్నవారకి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో అవసరమైతే ఒకరిద్దరిని పక్కన పెట్టి వారికి ప్రత్యామ్నాయం కల్పించే యోచనలో కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకానొకప్పుడు ఏక ఛత్రాధిపత్యం వహించిన భూమా కుటుంబం చుట్టూ తాజా రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి.. నంద్యాల ప్రాంతంలో భూమా కుటుంబం ఓ రకంగా ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తోంది. దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మరణం వరకు ఆ కుటుంబం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉంది.. 2014 ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు శోభా నాగిరెడ్డి వారసురాలిగా వైసీపీ తరుపున ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీచేసిన వారి కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశం గూటికి చేరారు. ఇందుకు రెండు నియోజకవర్గాల్లో తమ రాజకీయ ప్రత్యర్థులతో ఉన్న వైరం కూడా మరో కారణం. 2014 ఎన్నికల్లో నంధ్యాల నుంచి భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనంతో గత సార్వత్రిక ఎన్నికల్లో అఖిల ప్రియతో పాటు బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు భూమా జగద్విఖ్యాతరెడ్డిపై వ్యాపార లావాదేవీలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. అఖిలప్రియ అరెస్టుకు రంగం కూడా సిద్ధమైంది.. ఈ పరిస్థితుల్లో ఆళ్లగడ్డలో అఖిలప్రియ విజయాన్ని తన భుజాన వేసుకుని ప్రచారం చేసిన మౌనిక తన సోదరిని అరెస్టు చేయాలంటే తనను దాటివెళ్లాలంటూ వార్తల్లోకెక్కారు.

హైదరాబాద్‌ భారతీయ విద్యాభవన్‌లో విద్యాభ్యాసం చేసిన ఆమె బీటెక్‌ పూర్తిచేసి విదేశాల్లో ఉద్యోగావకాశాలు వచ్చినా వెళ్లలేదు.. వ్యాపారానికే పరిమితమయ్యారు. వ్యాపార భాగస్వామి అయిన మంచు మనోజ్‌తో జీవిత భాస్వామ్యం పంచుకోవటంతో పాటు కర్నూలులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత తన మేనమామ అయిన ఎస్వీ మోహన్‌రెడ్డి, తాత ఎస్వీ సుబ్బారెడ్డిల ఆశీస్సులు తీసుకోవటం రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, ఆళ్లగడ్డ నుంచి గంగుల బ్రిజేంద్రరెడ్డి వైసీపీ అభ్యర్థులుగా గెలుపొందారు. గత మూడేళ్లుగా స్తబ్దతుగా ఉన్న భూమా కుటుంబం 2024 ఎన్నికల్లో మరోసారి ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ, నంధ్యాలలో భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్‌విఖ్యాతరెడ్డి కేడర్‌ను సమీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమా మౌనిక రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల సమయంలోనే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రాజకీయ వారసురాలుగా తనకు అవకాశం వస్తుందని మౌనికారెడ్డి భావించారు. అయితే అఖిలప్రియకు అవకాశం దక్కింది. అయినా మౌనిక తన సోదరి గెలుపులో భాగస్వామ్యం పంచుకుంది. మనోజ్‌తో వివాహం నేపథ్యంలో రాజకీయ సమీకరణల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కూడా భూమా కుటుంబంపై ఫోకస్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

మోహన్‌బాబు గత కొంత కాలంగా వైసీపీ అధినేత జగన్‌ తీరుపై అసహనంతో ఉన్నారు. ఇప్పుడు కోడలు మౌనికను చేరదీస్తే మోహన్‌బాబును బుజ్జగించినట్లవుతుందనే భావనతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.. కమ్మ, రెడ్డి సామాజికవర్గాల ఓటర్లు అధికంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి మౌనికను రంగంలో దించితే విజయావకాశాలు ఎలా ఉంటాయనే అంశాన్ని పరిశీలన జరుపుతున్నట్లు వినికిడి. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను తిరుపతి అసెంబ్లి సీటిచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ బోర్డు చైర్మన్‌ లేదా ఇతర కేబినెట్‌ హోదా కలిగిన ఏదో పదవి కేటాయించే దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఉన్నత విద్య పూర్తిచేసిన మౌనికారెడ్డి కి తల్లి శోభానాగిరెడ్డి తరహాలో వాక్చాతుర్యం ఉందని చెబుతున్నారు. స్థానిక పరిస్థితులు, రాజకీయాల పట్ల అవగాహన కూడా కలిగిన ఆమెను పోటీకి నిలిపితే ఎలా ఉంటుందనేది అధికార పార్టీ పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల మౌనికతో వివాహం సందర్భంగా ఆమె భర్త మంచు మనోజ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి.. తాను సినిమాలకే పరిమితమవుతానని మౌనిక క్రియాశీల రాజకీయాల్లోచేరి ప్రజలకు సేవలందిస్తానంటే తనకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. సేవా కార్యక్రమాలపై మౌనికకు ఆసక్తి ఉండటం కూడా ప్లస్‌ పాయింట్‌గా మారిందని చెప్పుకుంటున్నారు. ఒక వైపు అఖిలప్రియ టీడీపీలో ఫైర్‌ బ్రాండ్‌గా నంధ్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో మౌనిక ఎటువైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాలి . జగన్‌ తో దూరం పెరిగిన తరువాత మోహన్‌బాబు గత కొద్దినెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మౌనిక రూటెటనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో కీలక భూమిక వహిస్తున్న ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారనే ప్రచారం అధికార పార్టీలో ఊపందుకుంటోంది.. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఆ ఉన్నతాధికారి ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అన్నమయ్య జిల్లా నుంచి పోటీలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మొత్తంగా రాయలసీమ ప్రాంతంలో పూర్తి మెజారిటీ సాధించే దిశగా అధికార పార్టీ చేస్తున్న వ్యూహరచనలో కొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement