Saturday, April 20, 2024

Yanamala: జగన్ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

ఏపీ సీఎం జగన్ రెడ్డి పరిపాలనలో బడ్జెట్ కేటాయింపులు నీటి మూటలుగా మారాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్ లో కేటాయింపులకు, చేస్తున్న ఖర్చులకు పొంతనే ఉండట్లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులను పక్కనపెట్టి ముఖ్యమంత్రి తనకు తోచినవిధంగా ఖర్చు చేయడం వలన చట్టసభల్లో ఆమోదం పొందిన బడ్జెట్ కు విలువ లేకుండా పోయిందన్నారు. ఈ తరహా వ్యవహారశైలి కేవలం బడ్జెట్ ఉల్లంఘనే కాదు, చట్టసభలను అగౌరవ పర్చడం, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం, ప్రజలను అవమానించడం అని చెప్పారు. కేవలం ఒక్కరోజులో బడ్జెట్ పాస్ చేసుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అని పేర్కొన్నారు. ఈ తరహా నిర్ణయాలు సప్లిమెంటరీ గ్రాంట్స్, ఒరిజనల్ బడ్జెట్ అలోకేషన్స్ ను మించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఎఫ్ ఆర్ బిఎం రివ్యూ కమిటీ ప్రతి రాష్ట్రానికి ఫిస్కల్ కౌన్సిల్ ఉండాలని సిఫారసు చేసిందన్నారు. స్టేట్ ఫిస్కల్ కౌన్సిల్ ఉంటే ఇలాంటి ప్రమాదకర నిర్ణయాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు అని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన కేటాయింపులకు అనుగుణంగా ఖర్చులు జరిపేలా కౌన్సిల్ పర్యవేక్షిస్తుందన్నారు. బడ్జెట్ ఉల్లంఘనలను నియంత్రిస్తుందన్న యనమల… అభివృద్ది చెందిన దేశాలు, వర్ధమాన ఆర్ధిక వ్యవస్థలు దీనిని అత్యావశ్యకమని ఇప్పటికే తేల్చాయని చెప్పారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం గత 32నెలల్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్ రూల్స్ ఉల్లంఘించారని, బడ్జెట్ నిధులను దారి మళ్లించాదరన్నారు. బడ్జెట్ మాన్యువల్ ను ధిక్కరించారన్నారు. సప్లిమెంటరీ గ్రాంట్స్ 10% టార్గెట్ కన్నా మించకూడదన్న సూత్రాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో అవినీతి కుంభకోణాలు, ప్రజాధనం దుర్వినియోగం తప్పించి అభివృద్ధే లేదన్నారు.

సమాజంలో ఆస్తుల కల్పనకు దోహదపడే మూలధన వ్యయం అడుగంటిందన్నారు. 2020-21 బడ్జెట్ తొలి 6 నెలల్లో 4వ వంతు కూడా మూలధనం ఖర్చు చేయలేదని మండిపడ్డారు. రూ31,198 కోట్లకు గాను రూ 6,711 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదన్నారు. రెవెన్యూ వ్యయం సగం కూడా చేయలేదని, జలవనరులు, వైద్య ఆరోగ్య రంగాల్లో ఖర్చు నామమాత్రమేఅని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,237కోట్లు కేటాయించి 6 నెలల్లో చేసిన ఖర్చు కేవలం రూ 1,729కోట్లు మాత్రమే అని విమర్శించారు. అత్యంత ప్రాధాన్యమైన జలవనరుల రంగంపై 15%కూడా ఖర్చుపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తంలో 25%మాత్రమే ఖర్చుపెట్టారన్నారు. జగన్ రెడ్డి అనాలోచిత చర్యలతో రైతాంగానికి తీవ్రనష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన రూ.2,464 కోట్లలో రూ. 400కోట్లు కూడా ఖర్చుచేయలేదన్నారు.

నికర రుణంలో 64% మూలధన వ్యయంపై ఖర్చుచేయాలని కేంద్రం రాసిన మార్గదర్శకాల లేఖను బుట్టదాఖలు చేశారని యనమల ఆగ్రహించారు. కేంద్రం పేర్కొన్నప్రకారం 2020-21లో మూలధన వ్యయం రూ 49,280 కోట్లు చేయాల్సి ఉండగా రూ.19 వేల కోట్లు కూడా చేయలేదన్నారు. ఇప్పటికే ద్రవ్యలోటు 13%, జిఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి 35.6%కు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో వృద్దిని 15% నుంచి 1.03%కు దిగజార్చారన్నారు. జగన్ అనాలోచిత చర్యలతో ఆంధ్రప్రదేశ్ ను ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టి, రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 32నెలల్లో తీవ్ర ఆర్ధిక క్రమశిక్షణా రాహిత్యానికి(ఫిస్కల్ ఇన్ డిసిప్లిన్)పాల్పడిందన్నారు. రాష్ట్రప్రభుత్వం తెస్తున్న అప్పులు, చేస్తున్న ఖర్చుల నియంత్రణకు ఒక మెకానిజం ఏర్పాటు తక్షణమే అవసరం అని అభిప్రాయపడ్డారు. ఆంధప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ భవిష్యత్ లో బాగుచేయలేనంత అధ:పాతాళానికి దిగజారక ముందే కేంద్రం మేల్కొనాలని యనమల కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement