Friday, April 19, 2024

ముడుపులిచ్చి క‌ట్టె కొట్టేస్తున్నారు..

అమరావతి,ఆంధ్రప్రభబ్యూరో: ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, భారీ, మధ్య తరహా చెరువుల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దట్టమైన తుమ్మ చెట్లను కొంతమంది అక్రమార్కులు దొడ్డి దారిన కొట్టేస్తున్నారు. అందుకు ఆయా ప్రాంతాలకు చెందిన జలవనరుల శాఖ అధికారులు కట్టె మాఫియాకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జలాశయాలు, చెరువుల పరిధిలో విలువైన తుమ్మ చెట్లను నిలువునా నరికేసి సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా వర్షాకాలంలో ఆయా చెరువులు, జలాశయాల పరిధిలో పుష్పలంగా నీరుంటాయి. వేసవికాలం వచ్చే సరికి క్రమేనా నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో వాటి వెనుక వైపున ఉన్న విస్తీర్ణంలో తుమ్మ చె ట్లు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. నిబంధనల మేరకు మూడేళ్లకు ఒకసారి జలవనరుల శాఖ అధికారులే తుమ్మ చెట్లకు వేలం నిర్వహిస్తారు. ఆ యా జలాశయాల పరిధిలో ఉన్న తుమ్మ చెట్ల విస్తీర్ణం, ఆ సమ యంలో మార్కెట్‌లో ఉన్న కట్టె ధరను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో కోడ్‌ చేసిన వారికే చెట్లు నరికే అవకాశాన్ని కల్పిస్తుంటారు. ఈ పక్రియలో కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ అవకతవకలు చోటుచేసుకుంటుంటాయి. అయితే మరికొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా లక్షల విలువ చేసే కలపను అమ్మేస్తున్నారు. ఈ వ్యవహా రంలో జలవనరుల శాఖ ఈఈ హోదాలో ఉండే అధికారులు చక్రం తిప్పుతూ సొంత ఖజానా నింపుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదా యానికి భారీ గండి పడుతుంది.
వాస్తవానికి చెరువులు, జలాశయాల లోతట్టు ప్రాంతాల్లో ఉండే తుమ్మ చెట్ల విస్తీర్ణం, విలువను ఎవరూ అంచనా వేయలేరు. ఉన్న తాధికారులకు కూడా సాధారణంగా సాధ్యం కాదు. దీంతో స్థాని కంగా ఉన్న అధికారులే తప్పుడు అంచనాలు, తక్కువ ధరలు సృ ష్టించి ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన సొమ్మును దారిమళ్లిస్తు న్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి బహిరంగంగానే సాగుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయి అధికారులు కట్టె మాఫియాపై దృష్టి సారించకపోవడంపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ముడుపులిస్తే చాలు.. పచ్చ జెండా ఊపుతున్న ఇరిగేషన్‌ అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో వేలాది చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2 వేలకు పైగా భారీ, మధ్య తరహా చెరువుల లోతట్టు ప్రాంతాల్లో దట్టమైన నల్ల తుమ్మ చెట్లు ఉంటాయి. వీటిని మరింత బలంగా తుమ్మ చెట్లు ఎదిగిన తర్వాత ఆయా ప్రాం తాలకు చెందిన ఇరిగేషన్‌ అధికారులు వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా చూస్తుంటారు. అయితే చెరువులతో పాటు గండి పాలెం లాంటి మినీ రిజర్వాయర్ల పరిధిలోనూ లక్షలాది రూపాయలు విలువ చేసే టన్నుల కొద్ది తుమ్మ చెట్లు ఉన్నాయి. అయితే వీటిని నిబం ధనల ప్రకారం వేలం వేసి విక్రయించే క్రమంలో కొన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు ముడుపులు తీసుకుని దొడ్డిదారిన చెట్లు నరికివేతకు పచ్చజెండా ఊపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా చెరువుల పరిధిలో లక్షల టన్నుల తుమ్మ చెట్లు ఉన్నట్లు ప్రాథమికం గా అంచనాలు ఉన్నాయి. వాటి ఆధారంగా చూస్తే ప్రతీ మూడేళ్లకు ఒకసారి నిబంధనల మేరకు వేలం వేస్తే ప్రభుత్వ ఖజానాకు కోట్లల్లో ఆదాయం వచ్చే అవకాశముంది. అయితే కొంతమంది అధికారులు ఉన్నతాధికారులకు కూడా తప్పుడు లెక్కలు చెబుతూ తుమ్మ కట్టె ఆదాయాన్ని కొంత పక్కదారి పట్టిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement