Tuesday, April 16, 2024

Spl Story: నిన్న విడుదల, నేడు మళ్లీ జైలుకు.. ఇంతకీ జీఎన్​ సాయిబాబా ఎవరు?

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరికొంతమందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ నిన్న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవ్వాల (శనివారం) సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై బాంబే హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపలేదని, కేసు ఇంపార్టెన్స్​ని పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే..ఈ కేసులో ఇంత ఇంపార్టెన్స్​ ఏముంది? ఇంతకీ జీఎన్​ సాయిబాబా ఎవరు? ఆయన ఏం చేశారని సంవత్సరాల కొద్దీ జైల్లో బంధించారు? అనే ప్రశ్నలు చాలామంది నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకును ప్రయత్నం చేద్దాం!

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మావోయిస్ట్ లతో సంబంధాలున్నాయన్న(సీపీఐ-మావోయిస్ట్) కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు (హెచ్‌సి) అక్టోబర్ 14న నిర్దోషిగా విడుదల చేసింది. అన్​లాఫుల్​ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (UAPA) కేసులో సాయిబాబాతో పాటు మరికొంతమంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 2104లో అరెస్టు అయ్యి, జైల్లోనే సంవత్సరాలుగా మగ్గిపోతున్నారు మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా. ఆయనతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నిన్న (శుక్రవారం) ఇచ్చిన ఉత్తర్వులపై శనివారం సుప్రీంకోర్టు స్టే విధించింది.

“సెక్షన్ 390, సిఆర్‌పిసి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద అధికారాన్ని వినియోగించుకోవడానికి ఇది సరైన కేసు అని తాము అభిప్రాయపడుతున్నామని, హైకోర్టు ఇంప్యుగ్డ్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయండి” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంఆర్ షా, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.  బాంబే హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన పిటిషన్‌పై డిసెంబర్ 8లోగా సాయిబాబా, ఇతర నిందితుల నుంచి స్పందనను కూడా అత్యున్నత న్యాయస్థానం కోరింది.

ఇంతకీ జీఎన్ సాయిబాబా ఎవరు?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు గోకరకొండ నాగ సాయిబాబా. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలహక్కుల కోసం పోరాటం  చేసేవారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా ఆయనకు ఎంతో మంచి పేరుంది. ఐదేళ్ల వయసులో తనకు పోలియో సోకినప్పటి నుంచి సాయిబాబా వీల్‌చైర్‌లోనే తిరుగుతున్నారు. అతను 90శాతం శారీరక వైకల్యంతో ఉన్నారు. 2014లో అరెస్టు చేయడానికి ముందు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ సబ్జెక్టు బోధించేవారు. అతని అరెస్టు తర్వాత కళాశాల సస్పెండ్ చేసింది. చివరకు 2021లో అతని సేవలను కూడా రద్దు చేసింది. 1990లలో ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీలపై “ఎన్‌కౌంటర్​”లకు వ్యతిరేకంగా ఉద్యమం  చేశారు సాయిబాబా. 2000వ దశకంలో అతను ఢిల్లీకి వెళ్లారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు.

సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) రాస్తూ.. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా “ఆపరేషన్ గ్రీన్ హంట్’’పై గళమెత్తారు. ప్రభుత్వాలను నిరుపేదలను, అమాయక వ్యక్తులను నక్సలైట్లుగా ముద్రవేసి ఎన్​కౌంటర్​ పేరిట హతమార్చే విధానాలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేపట్టారు. నిరుపేద వర్గాల ప్రజలు ఎంతోమంది రాజ్యాధికారం దాడికి బలైపోయారని వారి పక్షాన పోరాటం చేశారు. దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్​లో పేర్కొన్న ప్రకారం.. రెడ్ కారిడార్‌లో ఉన్న (దండకారణ్యం, బిహార్​, ఛత్తీస్​గఢ్​, జార్ఖండ్​, ఒడిశా, వెస్ట్​ బెంగాల్​, తెలంగాణ) పలు రాష్ట్రాల్లో ఎన్​కౌంటర్ల పేరిట ప్రజలను హతమారుస్తున్నారు. 2009లో నక్సలైట్ల కార్యకపాలపై ఎన్​కౌంటర్లు జరిగాయి. స్పెషల్​ ఆపరేషన్​ (గ్రీన్​ హంట్​) పేరిట జరిగిన ఎన్నో ఎన్​కౌంటర్లలో దాదాపు 2,392 మంది పౌరులు చనిపోయినట్టు పొందుపరిచారు.

అయితే.. ‘ఫోరమ్ ఎగైనెస్ట్ వార్ ఆన్ పీపుల్’ కింద మేధావులను సమీకరించడంలో సాయిబాబా కీలక పాత్ర పోషించారు. ప్రతి వేదికపై పోలీసుల దాడులను ఎండగట్టారు. ప్రతి చోటా ప్రభుత్వాన్ని నిందించడం చేశారు. ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. అతని ప్రచారంతో గిరిజన ప్రాంతాల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవలసి వచ్చింది. కొన్ని నివేదికల ప్రకారం.. అతను 2004లో జరిగిన ముంబయి రెసిస్టెన్స్, 2004లో జరిగిన ఫార్ లెఫ్ట్ యొక్క కన్వెన్షన్.. 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిషేధించబడిన రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో సంబంధం కలిగి ఉన్నట్టు ఆరోపణలున్నాయి.

ఈ కేసుపై బాంబే హైకోర్టు ఏం చెప్పింది?

మహారాష్ట్ర గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరికొందరు మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం.. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 (UAPA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) కింద వారిని అరెస్టు చేశారు. అయితే.. UAPA కింద తమకు విధించిన శిక్షను వ్యతిరేకిస్తూ సాయిబాబా తరపు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత బొంబాయి హైకోర్టు యొక్క నాగ్‌పూర్ బెంచ్ శుక్రవారం సాయిబాబాతో పాటు ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ఎటువంటి అనుమతి లేకుండా UAPA కింద కేసు పెట్టారని పేర్కొంది.

న్యాయమూర్తులు రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన నాగ్‌పూర్ బెంచ్.. సాయిబాబా, మరో ఐదుగురికి వ్యతిరేకంగా గడ్చిరోలి కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూనే, నిందితులకు చట్టపరంగా అందించిన ప్రతి రక్షణను కాపాడాలని పేర్కొంది. 2015 ఏప్రిల్‌లో ప్రాసిక్యూషన్‌కు అనుమతిని సమర్పించకముందే ఫిబ్రవరి 2015లో సాయిబాబాపై అభియోగాలు మోపడంతోపాటు సాక్షులను విచారించి, కేసును కోర్టు పరిగణలోకి తీసుకుందని సాయిబాబా తరపు న్యాయవాదులతో ఏకీభవిస్తూ కోర్టు పేర్కొంది.

యూఏపీఏ చట్టం దుర్వినియోగం చేస్తుందెవరు?

బొంబాయి హైకోర్టు ఉత్తర్వు కఠినమైన UAPA దుర్వినియోగం, మానవ హక్కుల కార్యకర్తల నుండి పెరుగుతున్న విమర్శలకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ విధానాలను విమర్శించే వారి నోరు మూయించేందుకు యూఏపీఏను దుర్వినియోగం చేస్తున్నారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. యూఏపీఏ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తగినన్ని భద్రతలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు.

ఉదాహరణకు.. 2022 T20 ప్రపంచ కప్‌లో ఆ దేశ క్రికెట్ జట్టు భారత్‌పై గెలిచిన తర్వాత పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై ఇటీవల శ్రీనగర్‌లోని ఒక వైద్య కళాశాలలో ఇద్దరు విద్యార్థులను UAPA కింద అరెస్టు చేశారు. అయితే.. ఈ కేసులో శిక్ష కంటే కౌన్సెలింగ్ అవసరం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది త్రిపుర పోలీసులు 102 మందిపై జర్నలిస్టులతో సహా రాష్ట్రంలో మత హింసాత్మక నివేదికలపై ట్వీట్లు, వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు.

ఇక.. గత ఏడాది రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల ఆధారంగా 3 శాతం కంటే తక్కువ శిక్షాస్మృతితో ఉగ్రవాద నిరోధక చట్టం కూడా చాలా పేలవంగా పనిచేసింది. 2021లో మూడేళ్లలో యూఏపీఏ కింద 4,690 మందిని అరెస్టు చేశారని, అయితే కేవలం 149 మందిని మాత్రమే దోషులుగా నిర్ధారించారని కేంద్రం తెలిపింది.

సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు ఏమిటి?

సాయిబాబాపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 13 (చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు), 18 (కుట్ర), 20 (ఉగ్రవాద ముఠా లేదా సంస్థ సభ్యుడు) 38-39 (ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం) అభియోగాలు మోపారు.  1967 భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120B (నేరపూరిత కుట్ర) కింద కూడా అతనిపై అభియోగాలు మోపారు.

పెన్ డ్రైవ్‌లో దొరికిన లేఖలే ఈ కేసులో సాక్ష్యం. సాయిబాబా మావోయిస్టు లీడర్లకు “ప్రకాష్” పేరుతో ఈ లేఖలను రాసినట్లు ఆరోపణలున్నాయి. అక్కడ అతను వైకల్యంతో ఉన్నా,  అండర్​గ్రౌండ్​లో పని చేయాలనే కోరిక గురించి తెలియజేసినట్టు ‘‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’’ రాసింది. సాయిబాబా పేరు మీద ఆయన కూతురు ప్రధానోపాధ్యాయుడికి, ఒకటి ఆయన కాలేజీకి, మరొకటి హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్‌కి రాసిన ఉత్తరాలు కూడా వెలుగులోకి వచ్చాయి.  

ఆ తర్వాత ఏంటి?

దోషులపై అభియోగాలు మోపిన నేరం యొక్క తీవ్రతను, కేసు యొక్క ఇంపార్టెన్స్​ని బాంబే హైకోర్టు పరిగణించలేదని సుప్రీం కోర్టు తెలిపింది. అందుకని దోషులుగా ఉన్న తీర్పుకు సంబంధించి వివరణాత్మక పరిశీలన అవసరమని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 7న విచారించనున్నట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement