Thursday, March 28, 2024

ఏపీపీఎస్సీ పరీక్షలెప్పుడు? నోటిఫికేషన్‌లు ఇచ్చి 7 నెలలైంది..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలై నెలలు గడుస్తున్నా పరీక్షల షెడ్యూల్‌ విడుదల కాకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది కోవిడ్‌, ఇతర సమస్యల కారణంగా జూన్‌లో క్యాలెండర్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి నెలా వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 15 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 1148 పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదలై నెలలు గడుస్తున్నా పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయకపోవడం ఆందోళనకు కారణమవుతోంది. మరోవైపు ఈ నోటిఫికేషన్ల దృష్ట్యా కోచింగ్‌ సెంటర్లలో రూ. వేలు చెల్లించి శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు తమపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విడుదలైన నోటిఫికేషన్లు ఇవే..

గతేడాది సెప్టెంబర్‌ నుంచి విడుదలైన నోటిఫికేషన్లు మొత్తం 1148 పోస్టుల భర్తీకి సంబంధించినవి. వాటిలో ఆయుష్‌ శాఖలో 151 పోస్టులు, అసెంబ్లిdలో తెలుగు రిపోర్టర్లు 5, అసిస్టెంట్‌ ఇంజనీర్లు 192, 4 డీపీఆర్వో పోస్టులు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డులో ఆరు పోస్టులు, నాన్‌ గెజిటెడ్‌ 38 పోస్టులు, స్త్రీ సంక్షేమ శాఖలో 22 పోస్టులకు సంబంధించి ఉన్నాయి. అవి కాకుండా డిసెంబర్‌ 28వ తేదీన రెవెన్యూ శాఖలోని 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, దేవదాయ శాఖలో 60 గ్రేడ్‌- 3 ఎండోమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులన్నింటికీ దాదాపుగా ఐదు లక్షల మంది వరకు నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా ఈ ఏప్రిల్‌ 18న అటవీ శాఖలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టులు తొమ్మిదిటి కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది.

గతంలో ఇలా..

ఏపీపీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్లలో గతంలో అయితే దరఖాస్తు తేదీ నుంచి గడువుతోపాటు పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించేది. అయితే ఇటీవల విడుదలవుతున్న నోటిఫికేషన్లలో కేవలం దరఖాస్తు వివరాలు, గడువు వివరాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక, ఎంతకాలం శిక్షణ తీసుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ విడుదలైన నెలా 15 రోజుల తర్వాత ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు మధ్య ప్రిపరేషన్‌ కోసం ఆరు నెలల గడువు ఉండాలి. అయితే గతేడాది సెప్టెంబర్‌ నుంచి విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించి మాత్రం ఈ వివరాలేవీ లేకపోవడం ఆందోళనకు కారణమవుతోంది. మరోవైపు కనీసం ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌నైనా ప్రకటిస్తే, పరీక్షలు తర్వాత నిర్వహించవచ్చని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement