న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ప్రభుత్వ తప్పిదాలపై ‘సిట్’ విచారణను నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దర్యాప్తు గొంతు నులుమడమేనని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ఏపీ హైకోర్టు తీర్పును తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్-కమిటీ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కీలక విధానపరమైన నిర్ణయాలు, పథకాల్లో కొన్నింటిలో అవకతవకలను గుర్తించి లోతైన దర్యాప్తు జరిపించి నిజానిజాలను వెలికితీయడం కోసం లోకాయుక్త, సీబీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరిపించాలని సిఫార్సు చేసిందని తెలిపారు.
ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసి, దానికొక పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేయకముందే ‘సిట్’ విచారణ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని, నిజానిజాలు వెలికితీయక ముందే ప్రాథమిక దశలోనే దర్యాప్తు గొంతు నులిమిందని చెప్పారు. నిజానికి ‘సిట్’ ప్రాథమిక విచారణలో అనేక అవకతవకలను, అవినీతిని గుర్తించిందని.. కచ్చితంగా ఏదైనా జాతీయస్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించదగిన కేసు అంటూ సిట్ అధినేత తన నివేదికలో పేర్కొన్నారని సింఘ్వి కోర్టుకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు కోసం లేఖ రాసిందని, వారికి అవసరమైన సహాయాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అందిస్తుందని ఆ లేఖలో పేర్కొందని వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరిన ఇలాంటి వ్యవహారాన్ని రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరిస్తూ ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏపీ ఫైబర్‌నెట్ అక్రమాలపై రెండు ఎఫ్.ఐ.ఆర్లు నమోదయ్యాయి కదా అని ప్రశ్నించింది. అవి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుదారుగా ఉంటూ చేసిన ఎఫ్.ఐ.ఆర్ కాదని, ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్.ఐ.ఆర్లు నమోదు చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుదారుగా కేసు నమోదు చేసినా, రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన దర్యాప్తు సంస్థ నేర విచారణ మొదలుపెట్టినా కక్షసాధింపు అనడానికి ఆస్కారం ఉంటుందని, కానీ అలాంటిదేమీ ఇక్కడ జరగలేదని సింఘ్వి వెల్లడించారు.
కానీ ఏపీ హైకోర్టు ఏమాత్రం సంబంధం లేని పాత జడ్జిమెంట్లను ఉదహరిస్తూ విచారణను ప్రాథమిక దశలో అడ్డుకుంటూ తీర్పునిచ్చిందని తప్పుబట్టారు. అది కూడా దర్యాప్తును నిలుపేయడం కోసం శాశ్వత ప్రాతిపదికన ఇంజంక్షన్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వ్యాఖ్యానించారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం (ఎగ్జిక్యూటివ్ పవర్)ను ప్రశ్నార్థకంలో పడేస్తూ తదపరి ఏర్పడే ప్రభుత్వాలకు గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదన్నట్టుగా తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న ధర్మాసనం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం తర్వాతి ప్రభుత్వానికి లేదంటూ బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
తప్పులు వెతికేందుకు వల విసిరినట్టుగా ఉంది
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కాసేపటికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింఘ్వి తన వాదనలు ముగించిన తర్వాత ప్రతివాది వర్ల రామయ్య తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏదైనా అంశంలో అవకతవకలు గుర్తించినప్పుడు లోతైన దర్యాప్తు జరపడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లు, జీవోల్లో గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల్లో తప్పులు వెతకాలన్నట్టుగా ఉందని పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చేపల వల విసిరినట్టుగా అన్ని నిర్ణయాల్లో తప్పులు వెతికి కక్షసాధింపులకు పాల్పడాలన్న ఉద్దేశం తప్ప మరేదీ కనిపించలేదని అన్నారు. ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేపట్టిన చర్య (రెజీమ్ రివెంజ్)గా ఆయన అభివర్ణించారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఆదేశాల మార్గదర్శకాల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)లో ప్రజాధనం దుర్వినియోగం, వృధా జరిగిందని గుర్తిస్తే తదుపరి లోతైన దర్యాప్తు జరపాల్సిందిగా ఉంది కదా అని గుర్తుచేసింది. అలాంటప్పుడు అభ్యంతరమేంటని ప్రశ్నించింది. సిట్ ప్రాథమిక విచారణ నివేదిక వచ్చేవరకు ఆగలేరా అంటూ అసహనం వ్యక్తం చేసింది. అయితే ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తొలుత ప్రాథమిక విచారణ జరిపి తదుపరి అవకతవకలు, అక్రమాలపై ప్రాథమిక సమాచారం ఉందని భావిస్తే తదుపరి లోతైన దర్యాప్తు జరపడం కోసం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తాయని, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేరుగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి నేర విచారణ మొదలుపెడుతుందని దవే వివరణ ఇచ్చారు. కక్షసాధింపు పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఉపేక్షించలేం కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు కోసమే చేస్తే న్యాయవ్యవస్థలో అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, వాటి ద్వారా రక్షణ పొందవచ్చని, కానీ అసలు నిజానిజాలు వెలికితీయకుండానే ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ దశలో కోర్టు సమయం ముగియడంతో తదుపరి దర్యాప్తు వాయిదా పడింది.