Thursday, April 25, 2024

ప్రిలిమ్స్ పై పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ నిర్ణ‌యం ఏంటీ..

ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్రంలో గ్రూప్స్‌ పోస్టుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో మాత్రమే ఉన్న ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షా విధానాన్ని పునరుద్ధరించాలన్న ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లోని వివిధ కేడర్లకు సంబంధించిన పోస్టులను గ్రూప్స్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తారన్న విషయం తెలిసిందే. విద్యారంగంతోపాటు పలు రంగాల నిపుణులతో కూడిన బోర్డు ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాల రూపకల్పన చేస్తుంది. అలాగే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కీలకమైన గ్రూప్‌ సర్వీసెస్‌ విషయంలో పునరాలోచన జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

గతంలో గ్రూప్‌- 1 సర్వీసెస్‌కు మాత్రమే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పేరుతో రెండుసార్లు పరీక్షలు జరిగేవి. అయితే 2014లో అప్పటి ప్రభుత్వం గ్రూప్‌- 2, గ్రూప్‌- 3 పోస్టుల భర్తీకి కూడా రెండు పరీక్షల విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అనంతరం ప్రభుత్వం మారడంతో ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అధికారులు గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల భర్తీ విషయంలో కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటికీ ప్రిలి మ్స్‌ పరీక్షను రద్దు చేసి.. ఒకే పరీక్ష నిర్వహించేలా కమిషన్‌ సూచిం చింది. గ్రూప్‌-1 పోస్టుల తరహాలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులకు రెండు పరీక్షలు(ప్రిలిమ్స్‌, మెయిన్స్‌) నిర్వహించాల్సిన అవసరం లేదని.. కేవలం ఒకే పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేయవచ్చనే ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

అయితే తాజాగా మరోసారి ఏపీపీఎస్సీ ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు నిర్వహించి, రెండు పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఒత్తిడి తగ్గించాలనే.. గ్రూప్‌- 2, గ్రూప్‌- 3 పరీక్షలకు హాజరయ్యే లక్షలాది మంది అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఆలోచనతోనే గతంలో ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్‌ రద్దు ప్రతిపాదన చేసింది. అలాగే ఒకే పరీక్షతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుందని సూచించింది. అందుకోసమే గతంలో గ్రూప్‌- 2, గ్రూప్‌- 3 పోస్టులకు ఉన్నట్లుగా ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరపాలని నిర్ణయించింది. రెండు పరీక్షల విధానం వల్ల అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ఎక్కువ రోజులు వెచ్చించాల్సి రావడంతోపాటు కోచింగులు, ఫీజులతో ఆర్థిక భారం పడేది. అంతే కాకుండా తీవ్ర పోటీని ఎదుర్కునేందుకు అభ్యర్థుల్లో- ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి, ఆర్థిక భారం తగ్గించాలంటే ఒకే పరీక్షా విధానం కొనసాగించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement