Tuesday, December 3, 2024

West Godavari – రావిపాడులో కొన‌సాగుతున్న టెన్ష‌న్…. 144 సెక్ష‌న్ విధింపు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో పోలీసులు నేడు 144 సెక్షన్ విధించారు. వివరాలలోకి వెళితే ఈ గ్రామానికి చెందిన పలివెల నాగేశ్వరరావు ఆర్మీలో మేజర్‌ సుబేదార్‌గా పనిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నాగేశ్వరరావుకు 3 సెంట్ల స్థలం కేటాయించి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో అక్కడ ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం శ్లాబ్‌ కూడా పూర్తయింది. అయితే ఈ గ్రామంలోని ఒక వర్గం ప్రజలు ఆయన స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించారు.. దీంతో అడ్డుకున్న సైనిక ఉద్యోగి భార్యపై స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు. అధికారులు హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు.

సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మీ గాయాలతోనే తన స్థలంలో నిరసన చేపట్టింది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, పోలీసులపైనా స్థానికులు రాళ్ల దాడిచేశారు. పెంటపాడు ఎస్ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో రావిపాడు గ్రామంలో రాత్రి నుంచి 144 సెక్షన్ కొనసాగుతుంది. . పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. ఇదే సమయంలో రావిపాడు గ్రామాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అజిత నేడు సందర్శించారు. సిబ్బందికి సూచనలు చేశారు.

- Advertisement -

గౌర‌వం లేన‌ప్పుడు మేం చ‌చ్చిన‌ట్లే..

ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఉదయం రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం సర్వే నంబర్‌ సరికాదని.. 24 గంటల్లో నిర్మాణాన్ని కూల్చివేయాలని నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను వారు తీసుకోకపోవడంతో నిర్మాణం జరుగుతున్న చోట గోడకు అతికించారు. స్థలం ఇచ్చి.. ఇప్పుడు కూల్చేయాలంటూ అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ ఆయన కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న డీఎస్పీ, పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. తాము ఇంటిలో ఉండగానే రెవెన్యూ అధికారులు ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నోటీసులు తొలగించాలని విజయలక్ష్మి, సుబేదార్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

కాగా, రావిపాడు స్థల వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమకు చావు తప్ప వేరే దిక్కులేదని వాపోయారు. ”బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు. రెవెన్యూశాఖ అధికారులు పొరపాటు చేసి నన్ను నా కుటుంబాన్ని బలిచేస్తున్నారు. వారిచ్చిన సరిహద్దుల ప్రకారమే నేను ఇల్లు నిర్మాణం చేపట్టాను. ఇక్కడ 30, 40 డిగ్రీల వాతావరణంలో ఉండలేకపోతున్నారు. మేము అక్కడ బోర్డర్ లో మైనస్ 40 డిగ్రీలలో దేశం కోసం పోరాడుతున్నాం. గత 42 ఏళ్లుగా ఈ ప్రభుత్వ స్థలం ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటుంటే మామీద దాడికి పాల్పడ్డారు. నిన్న నా భార్యకు జరిగిన అవమానానికి నేను చచ్చిపోయినట్టేన”ని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement