Thursday, April 18, 2024

రైతాంగాన్ని ఆదుకుంటాం.. ఐదు జిల్లాల్లో 25 మండలాల్లో దెబ్బతిన్న పంటలు

అమరావతి, ఆంధ్రప్రభ : అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగాన్ని ఫ్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, వారం రోజుల్లోగా పంట నష్టం అంచనా వేయాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి సిహెచ్‌. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చెప్పారు. ఆదివారం రాష్ట్ర సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడుతూ, నష్టపోయిన రైతులకు ఇన్పుట్‌ సబ్సిడీ అందించి ఆదుకుంటామని, అకాల వర్షాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్షించారని వారం రోజుల్లోగా పంట నష్టం అంచనా వేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారని అన్నారు. అధికారులు అందించిన ప్రాధమిక అంచనా ప్రకారం 5 జిల్లాల్లోని 25 మండలాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని మంత్రి వివరించారు.

నంద్యాల జిల్లాలోని 15 మండలాల్లో మొక్కజొన్న, వరి, మినుము, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని 5మండలాల పరిధిలో మొక్కజొన్న, కర్నూలు జిల్లాలో 1 మండలంలో మొక్కజొన్న, పార్వతీపురం మన్యం జిల్లాలోని 3 మండలాల్లో మొక్కజొన్న, అరటి, ప్రకాశం జిల్లాలో ఒక మండలంలో మినుము, ప్రత్తి పంట దెబ్బతిందని మంత్రి వేణుగోపాల కృష్ణ వివరించారు. రైతులు అన్ని విధాలా ఆనందంగా ఉండి రేపో మాపో పంట చేతికి వస్తుందనుకున్న తరుణంలో ఆకాల వర్షాలతో రైతులకు కొంత ఇబ్బంది కలిగిందని చెప్పారు.

- Advertisement -

పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులెవరూ ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పునరుద్ఘాటించారు. ఏ సీజన్‌లో పంటలు దెబ్బతింటే ఆ సీజన్లోనే ఇన్పుట్‌ సబ్సిడీ అందించి రైతులను ఆదుకునే విధానానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టి రైతులను ఆదుకుంటున్నట్టు మంత్రి వివరించారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్‌ సబ్సిడీని అందించడంతో పాటు పంటల బీమా కూడా కల్పించడం జరుగుంతోందని బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతులు విత్తనం మొదలు పంటలు పండించి వాటిని అమ్ముకునే వరకు వారికి తగిన తోడ్పాటును అందించేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement