Tuesday, October 15, 2024

AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం.. మంత్రి లోకేష్

అసలు చర్చే లేని అంశంపై వైసీపీ దుష్ప్రచారం
తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి
గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం
విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం
విశాఖలో సీఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్టర్ సదస్సు అనంతరం మీడియాతో మంత్రి నారా లోకేష్


విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చేలేదని.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. విశాఖ నోవాటెల్ లో సీఐఐ ఇన్ ఫ్ర్రాస్ట్రక్టర్ సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఐదేళ్ల తర్వాత ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు, అందుకు కావాల్సిన ఫైనాన్షియర్స్, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమ్మిట్ ఏర్పాటుచేసుకోవడం జరిగింది. భవిష్యత్ లో విశాఖకు ఏం చేయాలి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో పాటు భోగాపురానికి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై చర్చించడం జరిగిందన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించిందన్నారు. గతంలోనే అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో స్పీడ్ బ్రేకర్ లా అవి ఆగిపోయాయి. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశాలపై కూడా చర్చించడం జరిగిందన్నారు.

- Advertisement -

గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం..
గత ప్రభుత్వం రోడ్లు నిర్మించలేదు, కనీస గుంతలు కూడా పూడ్చలేదు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పారిశ్రామికవేత్తలు కూడా వెనక్కి వెళ్లిపోయారు. ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైజ్ చేయాలి, మౌలిక సదుపాయాలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలి. వెనుకబడిన ఏపీని మళ్లీ ముందుకు తీసుకుళ్లేందుకు సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నామ‌న్నారు. వారి సలహాలతో వాటిని ముందుకు తీసుకెళ్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం, ఎవరెక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అందుకు తగ్గట్లుగా రాయితీలు కల్పిస్తామ‌ని, పెట్టుబడులను పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నామ‌న్నారు.

విశాఖను ఐటీ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతాం…
గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున విశాఖలో పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీపడేవిధంగా చేస్తామ‌న్నారు. నిరుద్యోగ యువతకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తామ‌న్నారు. ఇప్పటికే అనేక ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీతో మేం చర్చించాం. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై వారికున్న సమస్యలపై చర్చించడం జరిగింది. అవన్నీ పరిష్కరించడం జరిగిందన్నారు. ఓ పెద్ద ఐటీ కంపెనీ 1500 మందికి ఉద్యోగాలు కల్పించనుందన్నారు. వచ్చే ఐదేళ్లలో 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామ‌న్నారు. ఆ కంపెనీకి గతంలో వీధిదీపాలు కూడా వేయలేదన్నారు. వారికి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదన్నారు. అవన్నీ క్లియర్ చేశామ‌న్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారని, ఫీల్డ్ విజిట్స్ కి కూడా వెళ్తున్నామ‌న్నారు.

రాబోయే వంద రోజుల్లో ఐటీ పాలసీ తీసుకువస్తాం..
రాబోయే వంద రోజుల్లో ఐటీ, జీసీసీ పాలసీ తీసుకువస్తామ‌న్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఐటీ పెట్టుబడులు తీసుకువస్తామ‌న్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై దృష్టిసారిస్తున్నామ‌న్నారు. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. గతంలో ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామ‌న్నారు. దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. భూమి కూడా ఇచ్చి శంకుస్థాపన కూడా చేశామ‌న్నారు. వైసీపీ ప్రభుత్వంలో నీరుగారిపోయిందని, వారందరితో సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు.

గత ఐదేళ్లలో విధ్వంసం చేశారు..
పరిశ్రమలకు పెండింగ్ లో ఉన్న రాయితీలను అందజేస్తామ‌న్నారు. వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేస్తామ‌న్నారు. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామ‌న్నారు. గత ఐదేళ్లలో విధ్వంసం చేశారు. ఈడీబీ(ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు)ని రద్దు చేశారన్నారు. దీనిని పునరుద్దరించామ‌న్నారు. గతంలో ఐటీ మంత్రి ఎప్పుడూ ఐటీ పరిశ్రమలతో సమావేశం నిర్వహించలేదన్నారు. మేం ఫోకస్డ్ గా వెళ్తున్నామ‌న్నారు. టాటా ఛైర్మన్ స్వయంగా వచ్చారు. ఇప్పుడు వైజాగ్ గురించి, ఏపీ గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. గతంలో లులుకు బాబుగారు రెడ్ కార్పెట్ వేసి తీసుకువచ్చారు. 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామన్నారు. పొరపాటున మళ్లీ సైకో వస్తే పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్నారు.

విశాఖ ఉక్కుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది..
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేం ఎవరం పరదాలు కట్టుకుని తిరగడం లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నామ‌న్నారు. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము మాట్లాడామ‌న్నారు. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదన్నారు. వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వలేదన్నారు. మైనింగ్ రద్దు చేశారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదు. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని త‌మ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పారు. కేంద్రం ఇటీవల రూ.500 కోట్ల గ్రాండ్ కూడా ఇచ్చింది. గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.

తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి…
బాబాయి హత్య కేసులో జగన్ రెడ్డి ఎందుకు సీబీఐ విచారణ కోరలేదు. సీబీఐ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొడుతున్నారు. తిరుమల లడ్డూపై ప్రమాణానికి తాను సిద్ధమని సవాల్ చేస్తే.. వైవీ సుబ్బారెడ్డి పారిపోయారన్నారు. నెయ్యిని మార్కెట్ ధర కంటే 40శాతం తక్కువ ధరకు ఇచ్చారు. సిట్ లో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వైసీపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఇవాళ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, రాజకీయాలు కాదు కావాల్సిందని నారా లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement