Thursday, May 26, 2022

మాల్‌ ప్రాక్టీస్‌ మాఫియాను అణచివేస్తాం.. నారాయణ బెయిల్‌పై హైకోర్టుకు: స‌జ్జ‌ల‌

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రశ్నాపత్రాల మాల్‌ ప్రాక్టీస్‌ మాఫియాను కచ్చితంగా అణచివేస్తామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఏం చేయాలనే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. నారాయణ సంస్థలో లీకేజీ.. వెనువెంటనే బెయిల్‌ మంజూరు.. అన్ని వ్యవహారాలపై తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గదని తేల్చిచెప్పారు. బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద విలేకర్లతో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి మెజిస్ట్రేట్ర్‌ ఇంటి వద్ద వాదనలు ఏమిటి? తెల్లవారుజాముకల్లా బెయిలేంటి? దీనిపై అంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. నారాయణ 2014లోనే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ ఆయనే అన్నీ చూసుకుంటు-న్నారని పైగా మాఫియాలా పని చేస్తున్న ఈ మాల్‌ ప్రాక్టీస్‌ పూర్తిగా నారాయణ కనుసన్నల్లోనే జరుగుతోందని స్వయంగా సిబ్బందే తేల్చి చెప్పినా బెయిల్‌ రావడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

నారాయణ విద్యా సంస్థల్లో జరిగింది ప్రశ్నపత్రాల లీకేజీ కాదన్నారు. పరీక్ష ప్రారంభం కాగానే పేపర్‌ను ఫోటో తీసి కొందరి వద్దకు పంపి సమాధానాలు రాయించి వాటిని విద్యార్థులకు చూపడం ద్వారా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో మొత్తం వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ఈ వ్యవహారం నడిపినట్లు విచారణలో తేటతెల్లమైందన్నారు. ఈ కేసులోనే అన్ని ఆధారాలతో నారాయణను అరెస్టు చేశారని తెలిపారు. గతంలో కూడా నారాయణ విద్యా సంస్థల్లో ప్రశ్నపత్రాలు బయటకు తీసుకురావడం, తద్వారా మంచి ఫలితాలు వచ్చేలా బాగోతం నడిపారని అప్పట్లో ఆయన మంత్రి కనుక గుట్టుచప్పుడు కాకుండా అంతా సాఫీగా జరిగిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తొలి రెండేళ్లు కోవిడ్‌ వల్ల పరీక్షలు జరగలేదని ఈసారి పరీక్షలు నిర్వహించడంతో, ఆ విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. ఒక నేరం జరిగినప్పుడు.. అందులో అత్యంత హేయమైన నేరం. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే నేరం.. పిల్లల మెరిట్‌ను దెబ్బ తీసే నేరం.. పవిత్రమైన విద్యా వ్యవస్థను కళంకితం చేసే నేరం..అది కూడా వ్యక్తిగతంగా కాకుండా, సంస్థాపరంగా చేయడం.. దాని కోసం మాఫియా ముఠా మాదిరిగా వ్యవహరించడం.. ఆనవాయితీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఈ సమాజం ఎలా పరిగణించాలి. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి? చూసీ చూడనట్లు వదిలేయాలా? లేదా పునాదులతో సహా నియంత్రించాలా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అని ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement