Sunday, December 1, 2024

AP | ఏపీలో గుంతల రహిత రోడ్ల‌ను నిర్మిస్తాం… మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు బ్యూరో : ఏపీలో గుంత‌ల ర‌హిత రోడ్ల‌ను నిర్మిస్తామ‌ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టీజీ భరత్ అన్నారు. మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. శనివారం మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని 5 రోడ్ల కూడలి (ఆర్.ఎస్. రోడ్డు జంక్షన్) నందు రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో గుంత‌ల ర‌హ‌దారుల్లో ప్ర‌యాణాలు సాగించ‌లేక ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నార‌న్నారు. అప్ప‌టి ప్ర‌భుత్వం రోడ్ల‌పై గుంత‌ల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు “మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర ప్రదేశ్” కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ర‌హ‌దారులు గుంత‌లుగా లేకుండా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 8,000 కిలోమీటర్ల రోడ్డులో 290 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రెండవ దశలో 8,000 కిలోమీటర్ల రోడ్డులో 350 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కర్నూలు జిల్లాలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద మెదటి దశలో 69పనులను రూ.11.16 కోట్ల వ్యయంతో 412.15 కిలోమీటర్లలో గుంతల రహిత రహదారులు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. రెండవ దశలో 171 పనులు 8.71 కోట్లతో 426.55 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహిత, ముళ్ళ కంప చెట్లు లేని రహదారులుగా డిసెంబర్ నెలలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మన కర్నూలు టౌన్ 5 రహదారుల కూడలి (ఆర్.ఎస్ .రోడ్డు జంక్షన్) నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు.

- Advertisement -

జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య మాట్లాడుతూ మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో మొదటి దశగా 69 పనులను 11.16 కోట్ల వ్యయంతో 412.15 కిలోమీటర్ల ను గుంతల రహిత రహదారులు చేపట్టామ‌ని, డిసెంబర్ నాటికి ప్రజల సౌకర్యాల కొరకు రోడ్లలోని గుంతలన్నింటిని పూడ్చ‌డం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రెండవ దశలో ఇంకొక దాదాపు 400 కిలోమీటర్ల రోడ్ల లోని గుంతలను మరమ్మతులు చేసి సంక్రాంతి పండుగ నాటికి ప్రజల సౌకర్యం కోసం మంచి రోడ్లను అందించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్.ఈ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్ అండ్ బీ ఈ.ఈ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement