Thursday, April 25, 2024

ఆంధ్రప్రదేశ్‌పై వివక్ష చూపొద్దు: కేంద్రానికి విజయసాయి విజ్ఞప్తి

ప్రత్యేక హోదా, రుణాలకు అనుమతుల మంజూరు విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై వివక్ష చూపొద్దని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాలకు న్యాయం చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రత్యేకహోదా గురించి సభలో మేం ప్రస్తావించడం లేదని టీడీపీ, ఇతర రాజకీయపార్టీలు మమ్మల్ని విమర్శిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానమంత్రిని ఏడు సార్లు, హోం మంత్రిని 12సార్లకు పైగా కలిసి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారని చెప్పారు. ఇటీవల హోంమంత్రి అధ్యక్షతన జరిగిన జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. దాని కోసం మేం సాధ్యమైనంత ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గత సమావేశాల్లోనూ ఆందోళనలతో సభను స్తంభింపజేశాం అని చెప్పారు.

విభజన చట్టాన్ని (జైరాం రమేశ్‌ వైపు చూపుతూ) నిర్లక్ష్యంగా, ఎన్నో లోపాలు, తప్పులతో రూపొందించడాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా తీసుకుంటోందని మండిపడ్డారు. ఏపీ విషయంలో ప్రత్యేకహోదా అంశం విభజన చట్టంలో లేకపోవడం వల్ల ఇవ్వలేమని చెప్పడం సమంజసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి .. ప్రత్యేక హోదా పోరాటాన్ని సంక్లిష్టంగా మార్చారని ఆరోపించారు. ఏపీ అన్ని విధాలుగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి చేయూత అందడం లేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement