Friday, December 6, 2024

Spcl Story | కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు…

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : కొత్త రేషన్ కార్డుల కోసం చిత్తూరు జిల్లా ప్రజలు గత ఏడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తమకు రేషన్ కార్డులు వస్తాయని ఆశించిన లబ్ధిదారులకు ఆశాభంగమే మిగిలింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి నాలుగు నెలలు అవుతున్న ఇంతవరకు రేషన్ కార్డుల విషయంలో దృష్టిని కేంద్రీకరించలేదు.

ఫలితంగా కొత్తగా వివాహాలు చేసుకున్న, వారు కుటుంబం నుంచి విడిపోయిన వారు, వలస వచ్చిన వారు, ఇతర పట్టణాలు, గ్రామాలకు బదిలీ అయిన వారు, ఇల్లు మారిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందని ఆసక్తిగా గ్రామ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఆ రోజు నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను రూపొందించారు.

ప్రభుత్వం నుండి అనుమతి కోసం ఎదురు చూస్తూన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి కాకుండా, ఎవరైనా ఇల్లు మారినా, ఊరు మారినా, రేషన్ కార్డులలో చిరునామా మార్చడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఏదైనా ప్రమాదం కారణంగా కానీ మరో రకంగా రేషన్ కార్డు పోగొట్టుకుంటే కొత్త రేషన్ కార్డు తీసుకోవడం కూడా కుదరడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రేషన్ కార్డులు ప్రింట్ తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోర్టర్ ను ప్రభుత్వం లాక్ చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుపు రంగు రేషన్ కార్డు లేత గోధుమ రంగు వర్ణంలో జారీ చేశారు. రెండు పేజీల రేషన్ కార్డును లామినేషన్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు.

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు మోడల్, రంగులో మార్పు చేసింది. రేషన్ కార్డులు బ్లూ కలర్ లోకి మార్పు చెందాయి. ప్రస్తుత వచ్చిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల డిజైన్ రంగు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు లేత పసుపు కలరుతో నూతన రేషన్ కార్డులతో జారీ చయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ప్రభుత్వం సూచనప్రాయంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నా, కొత్త రేషన్ కార్డుల జాలికి ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. కోటమి ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప కొత్తగా రేషన్ కార్డులు జారీ అయ్యే అవకాశం లేదు. జిల్లాలో ప్రస్తుతం 5.43 లక్షల రేష‌న్ కార్డులు ఉన్నాయి. కొత్తగా రేష‌న్ కార్డులు ఇస్తే రేష‌న్ కార్డుల సంఖ్య పెరుగుతుంది.

అలాగే రేష‌న్ కార్డులు వ‌చ్చిన త‌రువాత సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు కూడా పెరుగుతారు. జిల్లాలో 1,379 రేష‌న్ షాపులు ఉన్నాయి. అందులో కొన్ని డీల‌ర్ల పోస్టులు ఖాళీలున్నాయి. ఒకే డీల‌ర్‌కు రెండు, లేదా మూడు దుకాణాల ఇంఛార్జ్‌ల బాధ్యత‌లు ఇచ్చారు. ఖాళీల‌ను వెంట‌నే యుద్ధ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. స‌గ‌టున ఒక్కో షాపు ప‌రిధిలో 500 రేష‌న్ కార్డులు ఉంటాయి.

అయితే కొన్ని చోట్ల ఒక్కో షాపు ప‌రిధిలో 1,000 నుంచి 1,200 వ‌ర‌కు కార్డులు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ఎక్కువ కార్డులున్న చోట అద‌నంగా రేష‌న్ షాపులు ఏర్పాటు చేస్తారు. ఈ లెక్కన ప‌ట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు మించకుండా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మ‌రో నాలుగు వేల రేష‌న్ షాపులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అలాగే మ‌రోవైపు ఇంటింటి రేష‌న్ వాహ‌నాల‌ను కూడా నిలుపి వేసి, పాత ప‌ద్ధతిలోనే రేష‌న్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధప‌డుతుంది. 2021 జ‌న‌వ‌రి 1 నుంచి గ్రామాల్లోనూ, ఫిబ్రవ‌రి 1 నుంచి ప‌ట్టణాల్లో ఇంటింటికి రేష‌న్ పంపిణీ చేసేందుకు నాటి వైసీపీ ప్రభుత్వం నిర్ణ‌యించింది. నాటి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ప‌థ‌కాన్ని ప్రారంభించారు.

అందుకోసం మొబైల్ వాహ‌నాల‌ను కూడా కొనుగోలు చేసింది. అందుకోసం ముందు శ్రీ‌కాకుళం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఏడాదిగా అమ‌లు చేసింది. అనంత‌రం 2021లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ‌లు చేసింది. ఇంటింటికీ స‌రుకులు పంపిణీ చేయ‌డానికి జిల్లాకు 336 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహ‌నాల‌ను కొనుగోలు చేసింది.

ఒక్కో వాహ‌నానికి డ్రైవ‌ర్ క‌మ్ స‌ప్లైదారుడు ఒక‌రు, స‌హాయ‌కుడు మ‌రొక‌రు ఉంటారు. నిర్ణీత స‌మ‌యంలో ఇళ్ల వ‌ద్దకే వాహ‌నం వెళ్లి రేష‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రభుత్వం మారింది. దీంతో గ‌తంలోనే టీడీపీ నేత‌లు తాము అధికారంలోకి రాగానే రేష‌న్ షాపుల వ‌ద్దే రేష‌న్ ఇచ్చే పాత వ్యవ‌స్థను పున‌రుద్ధరిస్తామ‌ని హామీ ఇచ్చారు.

అందులో భాగంగానే ఇంటింటికీ రేష‌న్ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేసి, పాత రేష‌న్ షాపుల వ్యవ‌స్థనే మ‌ళ్లీ అమ‌లుకు తీసుకొచ్చేందుకు సిద్ధప‌డింది. వీలైనంత తొందరగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ కార్డు లేనిదే ఏ పధకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement