Tuesday, April 13, 2021

‘ఆప్తా’ సేవలు ప్రశంసనీయం – సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 3: అన్ని దానాల్లో కెల్లా విద్యాదానం గొప్పదని, అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్తా) ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలోని పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను తన చేతుల మీదుగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని రిటైర్డు ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. శనివారం ఎంవీపీ కాలనీలోని ఆళ్వార్‌దాస్‌ విద్యాసంస్థల ఆవరణలో మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మినారాయణతోపాటు డీఎస్‌పీ మెహర్‌బాబు పేద విద్యార్థులకు ఆప్తా ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వళనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కష్టపడి చదివిన విద్యార్థుల తలరాత మార్చే దిశగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఆనందదాయకమన్నారు. కోవిడ్‌ విజృంభణ వేళ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నామని, ఈ పరిస్థితి మారాలని, ఈ తరం పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం, కంప్యూటర్ల వాడకానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆప్తా సంస్థ పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో ఆర్థికసాయాన్ని అందించి విద్యకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు.
అనంతరం ఆప్తా అమెరికా ప్రతినిధి కృష్ణ సామంతుల మాట్ల్లాడుతూ అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారితో 2008లో ఏర్పాటైన ‘అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్తా)’లో ప్రస్తుతం 5 వేల మందికిపైగా సభ్యులున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆప్తా సభ్యులంతా కలిసి తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధులకు చదువుకు ప్రోత్సాహించాలన్న సంకల్పంతో ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచం మరింత పురోగమించనుందని, ఆనాటికి విద్యావంతులైన ప్రస్తుతం తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులెవరూ వెనకబడకూడదన్న సంకల్పంతో ఆప్తా ఆధ్వర్యంలో ఈ స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.6 కోట్ల స్కాలర్‌షిప్స్‌ అందించామని, 2020 సంవత్సరంలో వెనుకబడిన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎంపిక చేసిన వమెరిట్‌ విద్యార్థులకు రూ.2.6 కోట్లను స్కాలర్‌షిప్‌గా ఏకకాలంలో అందించామన్నారు. ఈ ఏడాది 1300 మంది విద్యార్ధులకు ఉపకార వేతనాన్ని అందించగా, అందులో ఉత్తరాంధ్ర నుంచి 100 మంది పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులకు చెందిన విద్యార్థులున్నారన్నారు. కార్యక్రమానంతరం రిటైర్డ్‌ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్‌ కట్‌ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రములో జేఎన్‌టీయూ, హైకోర్టు అడ్వకేట్‌ కళ్యాణ దిలీప్‌, అడ్వకేట్‌ కాత్యాయణి అప్పికొండ, డిఎస్‌పి మెహర్‌ బాబు, త్రినాధ్‌ అంత్యకుల, ఆప్తా ఇండియా ఆపరేషన్స్‌ చైర్మన్‌ కోటేష్‌ బాబు చవకుల, ఆప్త మాజీ వైస్‌ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ మన్యం, అధిక సంఖ్యలో విద్యార్థులు నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News