Thursday, March 28, 2024

భక్తుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

సామాన్య భక్తులకు దర్శనాల్లో ప్రాధాన్యత కల్పించేందుకు జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన‌ట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. దర్శన క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగుతీరు అందిస్తున్నామ‌న్నారు. మాడవీధుల్లో భక్తులకు ఎండ నుండి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్లు, చలువ సున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతంగా పీఏసీ-2లో అన్న ప్రసాద వితరణను పునః ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. వయో వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను ఆన్ లైన్ పద్ధతిలో ఏప్రిల్ 24 నుండి ప్రారంభించామ‌న్న ధ‌ర్మారెడ్డి.. తిరుమలలో ఈనెల 25 నుండి 29వ తేది వరకు హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామ‌ని తెలిపారు. మే 21 నుండి 26 వరకు ఒడిశాలో నిర్మించిన శ్రీవారి ఆలయంలో మహాకుంబాభిషేకం నిర్వహిస్తామ‌ని చెప్పారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. తిరుమలలో 1.50 ఎకరాల్లో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. రూ.18 కోట్లతో నిర్మిస్తున్న పరకామణి నూతన భవనాన్ని మూడునెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
మే 15 నుండి 17 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయులో వార్షిక వసంతోత్సవాలు నిర్వహిస్తున్నామ‌ని ధ‌ర్మారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement