Thursday, March 28, 2024

వీలైనంత త్వరగా విజయవాడ-గూడూరు రైల్వే లైన్ పనులు.. నిధులను పెంచామన్న రైల్వే శాఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పనులకు నిధులను గతం కంటే ఎక్కువగా పెంచామని రైల్వే శాఖ తెలిపింది. విజయవాడ –గూడూరు రైల్వే లైన్ అంశంపై బుధవారం వైఎస్సార్సీపీ మచిలీపట్నం ఎంపీ లోక్‌సభలో ప్రస్తావించారు. విజయవాడ-గూడూరు 3వ రైల్వే లైన్ ప్రాజెక్ట్ కొరకు రైల్వే శాఖ వెయ్యి కోట్లు మంజూరు చేసిన విషయం నిజమేనా? ఇప్పటివరకు జరిగిన పనులేంటి? ఎప్పటివరకూ రైల్వే లైన్ పూర్తవుతుంది? ఖర్చ ఎంతవుతుందో తెలియజేయాలని కోరారు. ఆయన ప్రశ్నలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.2015-16వ సంవత్సరంలో విజయవాడ–గూడూరు మధ్య 287 కి.మీటర్ల 3వ రైల్వే లైన్‌ను రూ.3,876 కోట్ల రూపాయలతో మంజూరు చేసినట్టు వెల్లడించారు. 2021 మార్చి వరకు ఈప్రాజెక్ట్ మీద రూ.2576 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయల మేరకు పనులను చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయని, ఇప్పటివరకు 66.85 కి.మీ. పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేయడం, అటవీ భూముల విషయంలో సంబంధిత అటవీశాఖాధికారులు క్లియరెన్స్ ఇవ్వడం, యుటిలిటీస్ షిఫ్ట్ విషయంలో ఉల్లంఘనలు, వివిధరకాల అధికారుల నుంచి చట్టపరమైన అనుమతులు పొందడం, ఆప్రాంతం భౌగోళిక, స్థల ఆకృతి, పనులు జరిగే ప్రాంతంలోని శాంతిభద్రతల పరిస్థితి, వాతావరణ పరిస్థితుల వల్ల ఆ ప్రాంత పరిధిలో ఒక సంవత్సరంలో జరిగే పని దినాల సంఖ్య, ఇలా అనేక రకాల కారణాలపై రైల్వే ప్రాజెక్టులు పూర్తవడం ఆధారపడి ఉంటుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2014 నుంచి రైల్వే శాఖలో ప్రాజెక్టుల మౌలిక వసతుల కల్పన, భద్రతా విషయంలో వ్యయం గణనీయంగా పెంచామన్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009-14 సంవత్సరానికి రూ. 886 కోట్లు బడ్జెట్ కేటాయించగా, అది 2014-19 సంవత్సరానికి రూ. 2830 కోట్లకు పెంచామని తెలిపారు. గతంలోని కేటాయింపుల కంటే సుమారుగా 219% ఎక్కువగా పెంచామన్నారు. 2019-20 సంవత్సరంలో రూ. 3885 కోట్లు కేటాయింపు ఉంటే 2009-14 బడ్జెట్‌తో పోల్చితే 338% , 2020-21 సంవత్సరంలో రూ. 4910 కోట్ల కేటాయింపు, అంటే 454% ఎక్కువ , 2021-22 సంవత్సరంలో రూ. 6223 కోట్లు కేటాయింపులు అంటే 602% ఎక్కువ నిధులు మంజూరు చేశామని కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు. రాష్ట్రంలో 2014-21 సంవత్సరాలలో 319 కి.మీ. కొత్త లైన్లు, 412 కి.మీ. మేర డబ్లింగ్ పనులు మొత్తం 731 కి.మీ. పనులు పూర్తి చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement