Thursday, March 28, 2024

విద్యార్థుల్ని విస్మరిస్తే కాల‌గర్భంలో క‌లిపేయడం ఖాయం: కేసీఆర్ కు రాములమ్మ వార్నింగ్

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. ఉస్మానియాలో వ‌సతుల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కే ప‌రిస్థితిని కేసీఆర్ స‌ర్కార్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. అన్నంలో పురుగులొస్తున్నాయని, పెరుగు, కూరలు సరిగ్గా ఉంటలేవని, బాత్ రూమ్‌లకు డోర్లు, లాక్‌లు లేవని ఓయూ క్యాంపస్ ఆడబిడ్డలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. అయినా అధికారులు కానీ, ప్ర‌భుత్వం కానీ ప‌ట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపెచ్చు… ప్రశ్నించే విద్యార్థినులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం కూడా వందలాది మంది విద్యార్థినులు పురుగుల అన్నం, కూరలతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మాలు చేసిన విద్యార్థులు… వ‌స‌తుల కోసం రోడ్డెక్కి నిర‌స‌న చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం అని పేర్కొన్నారు.

ఓయూ లేడీస్ హాస్టల్‌లో ప్రస్తుతం సుమారు 5 వేల మంది అమ్మాయిలు చదువుతున్నారని తెలిపారు. వారి కోసం నాలుగు మెస్‌లు నడుపుతున్నారన్న విజయశాంతి.. మెనూ ప్రకారం రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో కిచిడి, చపాతి, ఊతప్పం, పూరి, దోశ, ఇడ్లీ పెట్టాల్సి ఉన్నా… కేవలం ఇడ్లీ, పూరీలతోనే సరిపెడుతున్నారని మండిపడ్డారు. వాటి కోసం కూడా గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వారంలో రెండు సార్లు నాన్ వెజ్ పెట్టేవారని, ప్రతి బుధవారం 150 గ్రాముల మటన్, ప్రతి ఆదివారం 250 గ్రాముల చికెన్ ఇచ్చేవారని అన్నారు. కొంతకాలంగా మటన్ ఆపేసిన అధికారులు… ప్రస్తుతం చికెన్ మాత్రం ఇస్తున్నారని తెలిపారు. అది కూడా 100 గ్రాములకు మించడం లేదని విద్యార్థినులు చెబుతున్నారని అన్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. క‌నీసం తాగునీరు కూడా సరిగ్గా స‌ప్లై చేయ‌డం లేదని విమర్శించారు. కిటికీలు సరిగ్గా లేక గదుల్లోకి తరచూ పాములు వస్తున్నాయని అధికారులకు చెబుతున్నా… ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఇంత‌కంటే దారుణ‌ము ఎక్క‌డైనా ఉంటుందా? అని అడిగారు. ‘’దొర‌గారు ఫామ్ హౌస్‌లో ప‌డుకొని పాల‌న చేస్తే.. మ‌న ఆడ‌బిడ్డ‌లు ప‌డుతున్న క‌ష్టం ఏం తెలుస్తుంది? ఆడ‌బిడ్డ‌ల కష్టాలు ప‌ట్టని ఈ సీఎం ఉంటే ఎంత? లేకుంటే ఎంత‌? ఇప్ప‌టికైనా హాస్ట‌ల్స్‌లో సౌల‌తులు క‌ల్పించాలి. తెలంగాణ ఉద్య‌మంతో దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన ఘనత ఉస్మానియా సోంతం. కేసీఆర్…. విద్యార్థుల్ని విస్మరిస్తే వారు నిన్ను కూడా కాల‌గర్భంలో క‌లిపేయడం ఖాయం. ఎన్నోసార్లు రుజువైన సత్యమిది… గుర్తుంచుకో’’ అంటూ విజయశాతి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement