Friday, April 19, 2024

మహోజ్వ‌లం… విద్యుత్ మ‌హోత్స‌వం

  • ఆక‌ట్టుకున్న ప్ర‌ద‌ర్శ‌న‌లు, అల‌రించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు
  • క‌లెక్టరేట్ వేదిక‌గా సాగిన ఉజ్వ‌ల భార‌త్.. ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు వేడుక‌లు

విజ‌య‌న‌గ‌రం : ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వాల్లో భాగంగా స్థానిక క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో విద్యుత్తు శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జరిగిన ఉజ్వ‌ల భార‌త్‌.. ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు వేడుక‌లు మ‌హోజ్వ‌లంగా జ‌రిగాయి. విద్యుత్ వినియోగంపై అవ‌గాహ‌న పెంచుతూ… భ‌విష్య‌త్తుపై బాధ్య‌త‌ను తెలియజేస్తూ స్ఫూర్తిదాయ‌కంగా సాగాయి. వినియోగ‌దారుల‌ను ఆలోచింప‌జేసేలా… ఆక‌ట్టుకునేలా నిర్వ‌హించిన వివిధ ప్ర‌ద‌ర్శ‌న‌లు విశేషంగా నిలిచాయి. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే వివిధ ర‌కాల విద్యుత్తు ఉప‌క‌ర‌ణాల‌ను వివిధ సంస్థ‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచాయి. ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు విద్యుత్తు ఉత్స‌వాలు.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. విజ్ఞానాత్మ‌కంగా సాగాయి.

కార్య‌క్ర‌మానికి అతిథులుగా విచ్చేసిన జ‌డ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, నోడ‌ల్ అధికారి పి. ఆనంద్ బాబు త‌మ అమూల్య‌మైన సందేశాల‌ను ఇచ్చారు. విద్యుత్తు వినియోగంలో అంద‌రూ ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.. భవిష్య‌త్తు అవ‌సరాల‌ను దృష్టిలో పెట్టుకొని న‌డుచుకోవాల‌ని పేర్కొన్నారు.

విద్యుత్తు ఉత్ప‌త్తికి.. వినియోగానికి మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించాలి : జ‌డ్పీ ఛైర్మ‌న్‌
దేశంలోని వివిధ రంగాల ప్ర‌గ‌తిని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో కేంద్రం ఆజాది కా అమృత్ మహోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంద‌ని.. దానిలో భాగంగానే మ‌నంద‌రం ఈ రోజు విద్యుత్ ఉత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్నామ‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస రావు గుర్తు చేశారు. 2047 నాటికి దేశంలో సంపూర్ణ విద్యుత్తు స‌రఫ‌రా అందుబాటులో ఉంచాలంటే విద్యుత్తు ఉత్ప‌త్తికి.. వినియోగానికి మ‌ధ్య అంత‌రం త‌గ్గించాల‌ని పేర్కొన్నారు. గృహ వినియోగానికి ఏ మేర‌కు విద్యుత్తు స‌ర‌ఫరా చేస్తున్నామో… పారిశ్రామిక అవ‌స‌రాల‌కు కూడా అంతే మోతాదులో స‌ర‌ఫ‌రా చేయ‌గలిగే స్థితికి చేరుకోవాల‌న్నారు. రాబోయే 25 సంవ‌త్సరాల్లో 100 శాతం విద్యుదీక‌ర‌ణ‌.. ఉత్ప‌త్తి దిశ‌గా చేరుకోవాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని పేర్కొన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పునురుత్పాద‌క విద్యుత్తు ఉత్ప‌త్తికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. ఉజ్వ‌ల భార‌త్‌.. ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు విద్య‌త్తు శాఖ అధికారులు, వినియోగ‌దారులు బాధ్య‌తాయుత‌మైన కృషి చేయాల్సి ఉంద‌ని జ‌డ్పీ ఛైర్మ‌న్‌ పేర్కొన్నారు. ప్రజా అవ‌స‌రాల‌ను తీరుస్తూ.. ఆర్థిక ప్ర‌గ‌తి సాధించే దిశ‌గా ప్ర‌భుత్వాలు ఆలోచ‌న చేస్తూ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని ఉద్ఘాటించారు.

ప్ర‌జ‌లంద‌రూ సౌర విద్యుత్ వినియోగం వైపు మ‌ళ్లాలి : జిల్లా క‌లెక్ట‌ర్
దేశంలో రోజురోజుకీ స‌హజ వ‌న‌రుల సంఖ్య త‌గ్గిపోతున్న త‌రుణంలో అంద‌రూ బాధ్య‌త‌గా విద్యుత్తును వినియోగించాల‌ని, అంద‌రూ సౌర విద్యుత్తు వైపు మ‌ళ్లాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కు జిల్లాలోని చారిత్రాత్మ‌క ప్ర‌దేశాల్లో విద్యుత్తు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించుకున్నామ‌ని తెలిపారు. ఉత్స‌వాల‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్ర‌తి ఒక్క‌రూ విద్యుత్తును చాలా పొదుపుగా వినియోగించాల‌ని సూచించారు. బ‌యో గ్యాస్‌, సౌర విద్యుత్తు వినియోగానికి ప్రాధాన్య‌త ఇస్తూ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని.. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని న‌డుచుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు గుర‌వుతూ అంద‌రి జీవితాల్లో వెలుగులు నింపుతున్న విద్యుత్తు ఉద్యోగుల శ్ర‌మ‌ను, కృషిని మ‌నంద‌రం గుర్తించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

విద్యుత్తు వినియోగంపై ప‌రిమితి ఉండాలి : విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే
బిజిలీ ఉత్స‌వాల ఉద్దేశాన్ని నెర‌వేర్చాలంటే విద్యుత్తు వినియోగంపై ప‌రిమితి ఉండాల‌ని అప్పుడే అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌ల‌మ‌ని విజ‌యన‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి పేర్కొన్నారు. విద్యుత్ అనేది పంచభూతాల్లో ఒక్క‌టికిగా ఈ రోజు మాన‌వాళి అవ‌స‌రాల‌ను తీరుస్తోంద‌ని గుర్తు చేశారు. కాబ‌ట్టి విద్యుత్తును ప‌రిమితింగా వినియోగించాల‌ని, వృథా చేయ‌రాద‌ని సూచించారు. 2047 నాటికి అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోవాలంటే ప్ర‌స్తుతం మ‌నంద‌రం ఎంతో బాధ్య‌త‌గా మెల‌గాల‌ని హిత‌వు ప‌లికారు. విద్యుత్తు ఉద్యోగుల, సిబ్బంది కృషి అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.అనంత‌రం నోడ‌ల్ అధికారి పి.ఆనంద్ బాబు, విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడారు. ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా న‌డుచుకోవ‌టం ద్వారా ఉజ్వ‌ల భార‌త్‌… ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మ ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని పేర్కొన్నారు.

- Advertisement -

ఆక‌ట్టుకున్న ప్ర‌ద‌ర్శ‌న‌లు
ఉజ్వ‌ల భార‌త్.. ఉజ్వ‌ల భవిష్య‌త్తు వేడుక‌ల్లో భాగంగా స్థానిక క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వెలుప‌ల వివిధ విద్యుత్తు ఉప‌క‌ర‌ణాల త‌యారీ కంపెనీలు ఉప‌క‌ర‌ణాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచాయి. ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాలు, సోలార్ పంపు సెట్టు, ఫ్యాన్లు, ఎల‌క్ట్రిక‌ల్ సైకిళ్లు, వ్య‌వ‌సాయ మోటార్లు, ఇన్వెర్ట‌ర్లు, సోలార్ దీపాలు త‌దిత‌ర ప‌రిక‌రాల‌ను ఆహుతులు ఆశ‌క్తిగా తిల‌కించారు. స్వాతంత్య్ర స‌మర‌యోధులు జీవిత విశేషాల‌ను తెలుపుతూ స‌మాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథులు జ‌డ్పీ ఛైర్మ‌న్‌, క‌లెక్ట‌ర్‌, విజయ‌న‌గ‌రం ఎమ్మెల్యే త‌దిత‌రులు ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను తిలకించారు.

అల‌రించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు
తెలుగు వైభ‌వాన్ని, సోలార్ విద్యుత్తు ఆవ‌శ్య‌క‌త‌ను, విద్యుత్తు వినియోగాన్ని తెలుపుతూ నిర్వ‌హించిన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆహుతుల‌ను విశేషంగా అల‌రించాయి. గృహ విద్యుత్తు వినియోగంపై వాసుదేవ రావు బృందం నాటిక ప్ర‌ద‌ర్శించ‌గా.. తెలుగు వైభ‌వాన్ని తెలుపుతూ అమృత వ‌ర్షిణి డ్యాన్స్ పాఠ‌శాల విద్యార్థులు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. అలాగే కేంద్ర విద్యుత్తు శాఖ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన వివిధ షార్టు ఫిల్ముల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించారు.

విద్యుత్ శాఖ సేవ‌ల‌పై వినియోగ‌దారులు సంతృప్తి
కొంత‌మంది వినియోగదారులు విద్యుత్తు శాఖ అధికారుల సేవ‌ల‌పై అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. కింది స్థాయి నుంచి ఉన్న‌త స్థాయి వ‌ర‌కు ప్ర‌తి అధికారీ సానుకూలంగా స్పందిస్తున్నార‌ని స‌త్వ‌ర‌మే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. 1912 కాల్ సెంట‌ర్ ద్వారా సంతృప్తి క‌ర సేవ‌లందిస్తున్నార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. గృహ వినియోగానికి, వ్య‌వ‌సాయ, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు స‌రిప‌డా విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని.. అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నార‌ని జిల్లాకు చెందిన పి. జ‌నార్ధ‌న‌రావు, జి. శ్రీ‌నివాస‌రావు, సీహెచ్‌. శ్రీ‌దేవి, బీవీజే వ‌ర్మ‌, ఎ. శ్రీ‌నివాసు సంతృప్తి వ్య‌క్తం చేశారు. ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో నోడ‌ల్ అధికారి పి. ఆనంద్ బాబు, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, విద్యుత్తు శాఖ‌ ఎస్‌.ఈ. నాగేశ్వ‌ర‌రావు, ఈఈలు కృష్ణ‌మూర్తి, ధ‌ర్మ‌రాజు, డీఈలు, ఏఈలు, ఇత‌ర అధికారులు, అధిక సంఖ్య‌లో వినియోగ‌దారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement