Thursday, March 28, 2024

వాళ్ల రూటే సెప‌’రేటు’

అమరావతి, ఆంధ్రప్రభ: డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్న సూక్తిని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ లోని అక్రమార్కులు గట్టిగా ఒంటపట్టించుకున్నారు. పదోన్నతులు, బదిలీలే కాదు ఫిర్యాదుల్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. విజిలెన్స్‌ ఎంక్వైరీల పేరిట అందినకాడికి దండుకుంటున్నారనే అభియోగాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగుల అవినీతికి సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఆప్షన్లు పెట్టి మరీ పిండేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఫిర్యాదులపై సీఎంఓ అడిగే రిమార్క్‌ల్ని సైతం తమదైన శైలిలో మేనేజ్‌ చేసే ప్రబుద్ధులు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో ఉన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులకు సంబంధించిన ఫిర్యాదుల ఫైళ్ళు  సుమారు 1,500 నుంచి 2,200 వరకు విజిలెన్స్‌ విభాగంలో పెండింగ్‌లో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారుల అవకతవకలకు పాల్పడిన సందర్భాల్లో వైద్యశాఖలో ఫిర్యాదుల పరిష్కారానికి విజిలెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ (డీఎంఈ), డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ (డీహెచ్‌) విభాగాలకు సంబంధించి వేర్వేరుగా విజిలెన్స్‌ విభాగాలు పనిచేస్తాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగంలో విజిలెన్స్‌ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. సీఎంఓ నుంచి రిమార్క్‌ కోరుతూ ఫైల్‌ వచ్చిందంటే అక్రమార్కులకు పండగే. ఫిర్యాదు స్థాయిని బట్టి రేటు ఫిక్స్‌ చేస్తారు. నిధుల దుర్వినియోగం, అక్రమంగా బిల్లులు పాస్‌ చేయడం, అంతకు మించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా ఫరవాలేదు. కాకపోతే ఖర్చు పెరుగుతోందంతే. ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఉద్యోగి ముందు అక్రమార్కులు ఆప్షన్ల లిస్ట్‌ పెడతారు. ఆప్షన్‌ -ఏ యాక్షన్‌ తీసుకుంటాం, ఆప్షన్‌ -బీ స్వల్పంగా యాక్షన్‌ తీసుకుంటాం , ఆప్షన్‌ -సి కనికరిస్తాం, ఆప్షన్‌ -డి క్షమించి వదిలేస్తాం. మొదటి ఆప్షన్‌ ఎంచుకునే ఉద్యోగి విచారణ తదుపరి చర్యలకు సిద్ధపడి ఉండాల్సిందే. రెండో ఆప్షన్‌కు ఫిర్యాదు తీవ్రతను తగ్గించే మేనేజ్‌ చేస్తారు కాబట్టి ఓ మోస్తరులో ముడుపులు చెల్లిస్తే చాలు. ఇక మూడు, నాలుగు ఆప్షన్లు అయితే డబ్బు సంచులు ముట్టజెప్పాల్సిందేనని వైద్యశాఖకు చెందిన ఓ ఉద్యోగి ‘ఆంధ్రప్రభ’కు తెలిపారు.

అంతా ఎరెంజ్‌
ఏ శాఖలోనైనా ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే పై అధికారుల్ని విచారణాధికారులుగా నియమిస్తారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో జూనియర్‌ ఉద్యోగుల్నే విచారణాధికారులుగా నియమిస్తున్నారు. రీజనల్‌ డైరెక్టర్‌ క్యాడర్‌ ఉద్యోగిని విచారణాధికారిగా నియమించాల్సి ఉన్నప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులనే విచారణాధికారులుగా నియమించడం వెనుక మామూళ్ళ మహత్మ్యం నడుస్తోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఫిర్యాదు ఏదైనా విచారణాధికారుల టీం మాత్రం మారకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ టీం సభ్యులు ఫిర్యాదుదారుల్ని సైతం మేనేజ్‌ చేసి తమదారికి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు దారుడు భారతీయుడు తరహాలో నేను ఒప్పుకోను. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాల్సిందే అని గట్టిగా పట్టుబడితే సెంటిమెంట్‌ టచ్‌తో వాళ్లను కూల్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ఒక కేసుకు సంబంధించి ఫిర్యాదు దారుడు గట్టిగా నిలబడటంతో ఆ ఉద్యోగి రోడ్డున పడతాడు, వాళ్ళ కుటుంబం ఉసురు తగులుతోందని చెప్పి విచారణాధికారుల టీం తమదారికి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు దారుడు మొండి ఘటం అయితే ఆ ఫైళ్ళను పక్కన పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు రిమార్క్‌ ్స కోసం వచ్చిన ఫైళ్ళను తేదీలు, సంవత్సరాల వారీగా నిశిత పరిశీలన చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విచారణ సందర్భంగా ఫిర్యాదుల్ని మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆర్‌డీ కార్యాలయంలో పనిచేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగి ఒకరు డీహెచ్‌లోని అక్రమార్కులకు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాఫ్టింగ్‌లో దిట్ట అయిన ఆ ఉద్యోగి ఫిర్యాదుల్ని తారుమారు చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. డీహెచ్‌లోని విజిలెన్స్‌ విభాగం తీరుపై ఇటీవలే సీఎంఓకు ఫిర్యాదులు వెళ్ళినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది.

చర్యల్లేవ్‌
డెరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగంలో ఓ ఉన్నతాధికారి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి తన పై అధికారుల్ని సైతం బెదిరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఓ చిరుద్యోగిని కలెక్షన్‌ ఏజెంట్‌గా పెట్టుకొని అందినకాడికి దండుకుంటున్నాడనే విమర్శలు ఉన్నాయి. పలు పోస్టింగ్లలో ఉన్నతాధికార్ల పేర్లు చెప్పి పెద్ద మొత్తంలో నొక్కేశాడనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ లో ఈ 6సెక్షన్‌ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ సెక్షన్‌పై గతంలో కూడా అనేకమంది వైద్య అధికారులు ఆరోపణలు చేశారు. అయినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ అధికారులు దృష్టిసారిస్తే తప్ప డీహెచ్‌లోని అక్రమార్కుల ఆగడాలకు కళ్ళెం పడే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement