Tuesday, November 5, 2024

ఆలయ క్షేత్రాలే అడ్డాగా.. భక్తులను దోపిడీ.. వ్యాపారుల అక్రమాలపై విజి’లెన్స్‌’

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు అడ్డాగా చేసుకుని దుకాణాలు, వివిధ రకాల షాపులను నిర్వహిస్తున్న వ్యాపారులకు హద్దు అదుపు లేకుండా పోయింది. విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. గుడికి, పుణ్యక్షేత్రాలకు తరలివచ్చే వేలాది భక్తులు దేవుని దర్శనం చేసుకుని, భక్తి భావంతో వివిధ పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. కొందరు కొన్ని గంటల పాటు గుడిలో గడుపుతారు. మరికొందరు భక్తులు గుడిలోనే విడిది చేస్తారు. లేదా దేవాలయాల పరిసరాల్లో గదులు అద్దెకు తీసుకుని బస చేస్తుంటారు. అదేవిధంగా చాలామంది భక్తులు తమ మొక్కులు చెలించేందుకు దేవుని వద్దకు వస్తుంటారు. ఇలా అనేక విధాలుగా భక్తితో దేవుని దరి చేరి బస చేసే భక్తుల ఆహార పానీయాలు, నిత్యావసరాలు, పుజాధికాలకు కావాల్సిన సామాగ్రి, వస్తువస్త్రాలు, దేవాలయాల వద్ద లభించే ఇతర సామాగ్రి ని కొనుగోలు చేస్తుంటారు. అలాంటప్పుడు గుడి వద్ద పరిసరాల్లో దుకాణాలు, వివిధ వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్తులు భక్తుల అవసరాన్ని అసరా చేసుకుని విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ అధిక ధరలతో అందినకాడికి దోచుకుతింటున్నారు. దీంతో గుడికి వచ్చే సామాన్యులు ఈ దోపిడీకి గురవుతూ చెప్పుకోలేని పరిస్ధితి. ఇప్పుడిలాంటి దోపిడీపైనే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ దృష్టి సారించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ శంకభ్రత బాగ్చి నేతృత్వంలో ఇటీవలకాలంలో రాష్ట్రంలో చురుకుగా పని చేస్తోంది. సర్కార్‌ అభిమతానికి అనుగుణంగా పని చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే అక్రమార్కులతోపాటు, కింది స్ధాయి సామాన్యునికి క్షేత్ర స్థాయిలో జరిగే దోపిడీని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దేవాలయాల వద్ద వ్యాపారస్తుల దోపిడీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

వివిధ జిల్లాల్లో 45 దేవాలయాల వద్ద..

రాష్ట్రంలోని యాత్రికుల ప్రదేశాల్లొ కొంతమంది దుకాణదారులు ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వివిధ 45 దేవాలయాల సమీపంలోని 380 దుకాణాలను విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి రామనారాయణ ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం, శ్రీ వరాహలక్ష్మీ నరసింహ దేవస్థానం, అనకాపల్లి జిల్లా శ్రీ నూకాంబిక ఆలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని శ్రీ మోదమాంబ ఆలయం. కాకినాడ జిల్లా శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయం, అన్నవరం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, కోనసీమ జిల్లా ద్రాక్షారామం, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మద్ది ఆంజనేయ దేవాలయం, శ్రీ మావుళ్లమ్మ వారి ఆలయం, హనుమాన్‌ జంక్షన్‌ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయం, ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం, పలనాడు జిల్లా నిదానంపాడు శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం. ప్రకాశం జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం, భవనాక్షి ఆలయం, మహాలక్ష్మి ఆలయం, రామతీర్దం ఆలయం, సాయిబాబా ఆలయం, శ్రీరామ ఆలయం, శివాలయం ఆలయం, వల్లూరమ్మ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం. నరసింహ స్వామి ఆలయం, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయీ అమ్మవారి ఆలయం, శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి ఆలయం, నెల్లూరు జిల్లాలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం. శ్రీ స్వయంబు వరసిద్ది వినాయక దేవస్థానం, కాణిపాకం చిత్తూరు జిల్లా. శ్రీకాళహస్తీశ్వర ఆలయం, శ్రీకాళహస్తి, శ్రీ పద్మావతి ఆలయం, తిరుచానూరు, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం, శ్రీ వేద నారాయణ స్వామి ఆలయం, నాగలాపురం, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి జిల్లా అప్పలాయగుంట. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం, గండి క్షేత్రం ఆంజనేయ స్వామి దేవాలయం. అనంతపురం జిల్లా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. కర్నూలు జిల్లా మహానందీశ్వర స్వామి ఆలయాన్ని విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వ్యాపారులు పాల్పడుతున్న అనేక అక్రమాలను గుర్తించారు. వివిధ రకాల ఆహారం, వస్తు సమాగ్రిలపైఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో వారిపై లీగల్‌ మెట్రాలజీ ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ రూల్‌ 2011, లీగల్‌ మెట్రాలజీ చట్టం 2009 సెక్షన్‌ 18(2) ప్రకారం 209 కేసులు నమోదు చేశారు. ఈ తరహా దాడులు రాష్ట్రంలో మరిన్ని నిరంతరం కొనసాగనున్నాయి. ఇప్పటికే రెండో దశ తనిఖీలకు జాబితాను అధికారులు సిద్ధం చేశారు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద సైతం సామాన్య భక్తులు, యాత్రికులను దోపిడీ చేసే విధానం వ్యాపారులు మానుకోవాలని, చట్టం, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ శంకభ్రత బాగ్చి హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement