Wednesday, April 24, 2024

సహాయం చేయండి లేదా సేవ చేయండి: ఉపరాష్ట్రపతి వెంకయ్య

స్వాతంత్ర్య ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఆ మహనీయుల కృషి చేసింది వారి కోసం కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని తెలిపారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ కన్వెన్షన్ సెంటర్ లో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. 1885, 1945 మధ్య కాలానికి చెందిన ఉమర్ అలీషా గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులన్న ఉపరాష్ట్రపతి.. మహా పండింతుడు, మేధావి, బహు గ్రంథకర్త, మహావక్త అయిన శ్రీ అలీషా గారు అంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవలందించారని తెలిపారు. స్వరాజ్యం కోసం తమ వాణిని చట్టసభల్లో బలంగా వినిపించిన అలీషా చట్టసభల ప్రసంగాలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.

ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చాటిచెప్పిన మానవతావాదిగా అలీషా అని అభివర్ణించారు. సామాజిక చైతన్యం కోసమే గాక, మహిళా సాధికారత కోసం వారు కృషి చేశారని పేర్కొన్నారు. స్వరాజ్యం సముపార్జించుకుని 75 సంవత్సరాల మైలురాయిని అధిగమిస్తున్న తరుణంలో  కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్”పేరిట గొప్ప ఉత్సవాలను సకల్పించడం అభినందనీయమన్నారు. ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని ముందు తరాలకు అందించడమేనని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, ఆచార్య ఎన్జీ రంగా, తెన్నేటి విశ్వనాథం, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి మహనీయులతో పాటు ఎందరో మహిళామణులు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ దాతలుగానే ఉండాలన్నారు. సహాయం చేయండి లేదా సేవ చేయండి అని పిలుపునిచ్చారు. మహిళలకు సమానమైన భాగస్వామ్యం కల్పించడం ద్వారానే వేగవంతమైన పురోగతి సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement