Thursday, November 7, 2024

Indrakiladri | జగన్మాత చెంత చతుర్వేద పండిత సభ…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో ) : ఇంద్రకీలాద్రిపై కొలువైన వేద స్వరూపిణికి దుర్గాష్టమి రోజున వేద పండితులు మంత్రాభిషేకం వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వేద పండితులు వచ్చారు.

ఇంద్రకీలాద్రి ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో గురువారం వేదసభ జరిగింది. నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో అమ్మవారి ముందు మంత్రాలు పారాయణం చేశారు. వందలాదిమంది వేద పండితుల మంత్రాలతో ఆ ప్రాంగణమంతా వేద పరిమళాలు వెదజల్లింది.

శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి యేటా సంప్రదాయంగా వస్తున్న ఈ చతుర్వేద పండిత సభలో ఘనాపాటి, క్రమాపాటి వేద పండితుల శ్లోకాలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేద సభకు విచ్చేసిన వేద పండితులను దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో 130 మంది ఘనాపాటీలకు రూ. 6,000 చొప్పున, 262 మంది క్రమాపాటీలకు రూ. 5,000 చొప్పున పారితోషకాల్ని అందించారు. అదేవిధంగా అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. సభాధ్యక్షులకు రూ. 10,000 పారితోషకం అందజేశారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఈవో కేఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement