Thursday, April 25, 2024

తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటలు

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 16 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో గదులు దొరకని భక్తులు లాకర్లను పొంది తమ లగేజిలను అందులో భద్రపచుకుని టిటిడి ఏర్పాటు చేసిన షెడ్ల కింద సేద తీరుతున్నారు. ఇక వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండకు భక్తులు తండోప తండాలుగా చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఎటుచూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్‌లో దర్శనమిస్తున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భారీగా భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1, 2 క్యూలో కంపార్టుమెంట్లన్ని పూర్తిగా నిండి క్యూ లైన్‌లు వెలుపలకు వ్యాపించాయి. కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్‌లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సు -2 లోని 31 కంపార్టుమెంట్లు నిండి సుమారు రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్‌లో వేచివున్నారు.

ఇక కాలినడక భక్తులు ప్రవాహంలా తిరుమలకు తరలివస్తున్నారు. తమ మొక్కులు చెల్లింపులో భాగంగా కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారిని టిటిడి రద్దు చేయడంతో కాలినడక తిరుమలకు చేరుకుంటున్న భక్తులు సర్వదర్శనం ద్వరానే స్వామివారి దర్శించుకోవాల్సి రావడంతో సర్వదర్శనం క్యూ లైన్‌లు అంతకంతకు పెరిగి నారాయణగిరి ఉద్యాననం దాటి ఏటిసి సర్కిల్‌ వైపు నుంచి ఎస్‌ఎమ్‌సి మీదుగా లేపాక్షి, పాత అన్నదానం సముదాయాలను దాటి రామ్‌భగీచా వద్దకు చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లై న్‌లో వేచివున్నారు. కేవలం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను టిటిడి దర్శనానికి అనుమతిస్తున్నప్పటికి సర్వదర్శనం క్యూ లైన్‌మాత్రం ఏ మాత్రం తగ్గక పోగా అంతకంతకు పెరుగుతుంది. ఊహించనివిధంగా భక్తుల రద్దీ పెరిగినప్పటికి భక్తుల సౌకర్యాల కల్పనలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్‌లను పర్యవేక్షిస్తూ క్యూ లైన్‌లు త్వరిత గతిన కదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక క్యూలైన్‌లలో వేచివున్న భక్తులకు అన్నదానం విభాగం అధికారులు శ్రీవారి సేవకుల సహాయంతో ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ, టీ, కాఫి, అన్నప్రసాదాలు, అల్పాహారం లాంటివి నిరంతరాయంగా అందచేస్తున్నారు. ఈ రద్దీ సోమవారానికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement