Friday, April 19, 2024

విశాఖ‌లోనే ఎపి ప్ర‌భుత్వ ఉగాది వేడుక‌లు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది తెలుగు సంవత్స రం ఉగాది వేడుకలను విశాఖపట్టణంలోనే నిర్వహించ నున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనా రాజధానికి అదేరోజు మకాం మార్చే అవకాశాలు ఉండటంతో ఉగాది సంబరాలను అక్కడే నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.. మూడు రాజధానులపై ఈనెల 28వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అయితే సీఎం జగన్‌ ఇటీవల జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో తాను విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నట్లు మరోసారి వెల్లడించటంతో పాటు ఉద్యోగులకు సైతం ఇప్పటికే మౌఖికంగా సంకేతాలు అందాయి. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆవరణలో లేదా బీచ్‌ కారిడార్‌లో ఉగాది వేడుకలు నిర్వహించే యోచన లో ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది గ్లోబల్‌ సమ్మిట్‌తో శుభారంభమైందని ప్రభుత్వం భావిస్తోంది. గత మూడే ళ్లుగా కుదిపివేసిన కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడే రాష్ట్రం తేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడు లు పెట్టేందుకు ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ముందు కు రావటం 16.5 లక్షల కోట్ల పెట్టుబడి, 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.. గ్లోబల్‌ సమ్మిట్‌తో పాటు ఈనెల 29, 30వ తేదీల్లో జీ-20 సదస్సు విశాఖలోనే జరగనున్నందున అంతర్జాతీయంగా రాష్ట్రానికి మరోసారి గుర్తింపు రానుంది. ఇవన్నీ నూతన సంవత్సరంలో కలిసొచ్చే అంశాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

ఉగాదితో రాష్ట్రం కొత్తపుంతలు తొక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. పాలనా రాజధాని తరలింపు సుప్రీం తీర్పుపై అధారపడి ఉన్నప్పటికీ తాత్కాలికంగా క్యాంప్‌ కార్యాలయాన్ని ఉగాది నాడే లాంఛనంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలియవచ్చింది. కాగా ఈనెల 14వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో 22న క్యాంప్‌ కార్యాలయం, ఉగాది వేడుకల నిర్వహణపై సస్పెన్స్‌ నెలకొంది. గత మూడేళ్లుగా తాడేపల్లి తన నివాసం ఆవరణలోనే ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సభ్యులు ఉగాది వేడుకలు జరుపుకుంటున్నారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా అవసరమైన ఏర్పాట్లు చేయటంతో పాటు రాష్ట్ర ఆస్థాన పండితుల పంచాంగ శ్రవణాలతో పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన పల్లె శోభ సెట్టింగ్‌లను తొలగించడంతో ఈ ఏడాది విశాఖలో ఉగాది వేడుకలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.. తెలుగు సంవత్సరాది పంచాంగ స్రవణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట వ్యక్తులకు పురస్కారాల ప్రదానం తదితర ఏర్పాట్లపై నేడో, రేపో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement