Thursday, April 25, 2024

వరదలు తెచ్చిన తంట.. ఎటు చూసినా బురదే..

నెల్లూరు, ప్రభ న్యూస్‌ బ్యూరో : జిల్లాలో వరద తగ్గుముఖం పట్టింది. బాధితులంతా పునరావాస కేంద్రాల నుంచి ఒక్కొక్కరు సొంతగూటికి చేరుకుంటున్నారు. వారంతా సాయంచేసే చేతుల కోసం చేయూతనందించే దేవుళ్ల కోసం ఆశగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం, మంత్రులు, శాసనసభ్యులు రంగంలోకి దిగి సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నారు. గత నాలుగు రోజుల తర్వాత ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు తమ ప్రాంతాలను చూసి బోరున విలపిస్తున్నారు. ఎటు చూసినా.. శిథిలాలే, రోడ్లపైనా, ఇళ్లల్లో అదే బురద రోత పుట్టిస్తోంది. వందల కోట్లు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం నెల్లూరు, కోవూరుతో పాటు పెన్నా పరీవాహక ప్రాంతాలకు చెందిన ముంపు గ్రామాల బాధితులంతా ఇళ్లకు చేరుకున్నారు. అంతకుముందు రావసంలో తలదాచుకున్న వరద బాధితులకు ప్రభుత్వం సాయాన్ని అందించింది.

అయితే అది కేవలం వారికి కంటి తుడుపుకే సరిపోతోంది. పూర్తిస్థాయిలో వారికి సాయమందించాలంటే కేంద్ర సాయం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం చేయూతతోపాటు కేంద్రం పెద్ద మనసు చేసుకోవాలి. ఆదిశగా నెల్లూరుకు ఆర్ధిక సాయాన్ని అందించాలి. పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల్లో వరదలు వచ్చిన సందర్భంలో తక్షణమే ఆర్ధిక సాయాన్ని ప్రకటించి ఉదారతను చాటుకున్న కేంద్రం ఏపీ విషయంలో ఆదిశగా చొరవ చూపలేదన్న భావన వరద బాధితుల్లో వ్యక్తమవుతోంది. గడచిన రెండు, మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. వాటితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కొంత ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తోంది. ఆచేయూతకు మరో చేయి కేంద్రం అందిస్తే బాధితులకు కొంత ఊరట లభించినట్లవుతుంది. ఇదే అభిప్రాయం వరద బాధితుల్లోనూ వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదిశగా కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement