Thursday, April 18, 2024

గిరిజన బతుకులు నేటికీ చికట్లోనే..

మెరకముడిదాం, (ప్రభ న్యూస్‌): గిరిజనులు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు పత్రికలకే పరిమితం తప్ప ఆచరణ సాధ్యం కావడం లేదు. ఏటా గిరిజనులు అభివృద్ధికి కోట్లాది రూపాయిలు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ నేటికీ గిరిజనులు బతుకులు మారని గ్రామాలు అనేకం వున్నాయని చెప్పకతప్పదు. అందులో భాగంగా ఉత్తరావల్లి పంచాయతీ మధురా గ్రామం గదబపేట అని చెప్పవచ్చు. ఈ గ్రామంలో పూర్వం నుండి 10 కుటుంబాలు కొండలు, తోటలు మధ్య అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. వారి బతుకులు దయనీయంగా వుండటంతో పాటు అగమ్యగోచరంగా వున్నాయ‌ని చెప్పకతప్పదు. నిన్నమొన్నటి వరకు తోటలు మధ్యలో పూరిపాకల్లో తలదాచుకునేవారు. అయితే ఇటీవల కాలంలో నాలుగు ఇళ్లులు ప్రభుత్వం మంజూరు చేయగా, పునాదులు ప్రాప్తికి మూడు ఇళ్లకు బిల్లులు అందగా ఒక ఇంటికి ప్రభుత్వం బిల్లులు మంజూరుచేసిన దాఖాలాలులేవు అయితే గిరిజనులు బతుకులు చూసిన ప్రతీ ఒక్కరికీ గుండె చలించక తప్పదు.

గ్రామంలో మినీవాటర్‌ ట్యాంక్‌ వున్నప్పటికీ రెండు నెలలకోసారినీరు సరఫరా కావడంతో కిలో మీటరు దూరంలో వున్న బావికి వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీరు కోసం గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. అలాగే వీధి దీపాలు గత‌ కొన్ని నెలలుగా వెలగక పోవడంతో అంధకారంలోనే కాలాన్ని గడుపుతున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గ్రామం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామంలో వున్న రెండు విద్యుత్‌ స్థంభాలకు రెండు బల్బులు వేయటానికి నెలలుగడపటం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పకతప్పదు.

అనుకోని రీతిలో అనారోగ్యం సంబవించినా, 108కి ఫోన్‌ ద్వారా సమాచారం అందినప్నటికీ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవసరం వచ్చినా మూడు కిలోమీటర్లు దూరంలో వున్న ఉత్తరావల్లి వెళ్లాల్సిందే. రోడ్డు సౌకర్యం అంతంత మాత్రంగానే వుంది. ఈ పది కుటుంబాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా పింఛన్లు, రేషన్‌ బియ్యం, అడవినుండి తెచ్చిన కట్టెలను అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంతదారుణంగా గిరిజనులు బతుకున్నప్పటి కీ పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత‌ అధికారులు స్పందించి తక్షణమే గిరిజనులు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement