Wednesday, April 24, 2024

రోడ్డు బాగుచేయాలని.. రోడ్డెక్కిన విద్యార్థులు

అర్ధవీడు, (ప్రభ న్యూస్) : పాలకులు మారారు, అధికారులు మారారు, కాలగమనంలో క్యాలండర్లు మారాయి.. కానీ ఆ పాఠశాలకు వెళ్లే రహదారి మాత్రం మారలేదు.. వివరాలలోకి వెళితే అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లి గ్రామానికి కిలోమీటరు దూరంగా జ‌డ్పీ హైస్కూల్ ఏర్పాటు చేశారు. పాఠశాలకు వెళ్లాలంటే పొలాల మీదుగా చిన్న బురదరోడ్డులో వెళ్ళాలి. వర్షం పడితే బురదరోడ్డులో అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి ఆ చిన్నారులది. పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాలు అంకభూపాలం, అచ్చంపేట, పాపినేనిపల్లి, బొల్లుపల్లి గ్రామాలకు చెందిన సుమారు 230మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యాబ్యాసం చేస్తుండగా 12 మంది ఉపాధ్యాయులు వారికి బోధన చేస్తున్నారు. వీరంతా నిత్యం పాఠశాలకు వెళ్లాలంటే బురదరోడ్డులో నడవాల్సి రావడంతో పాటుగా.. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చిల్లకంపతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠ‌శాలల ఆధునీకరణలో భాగంగా పాఠ‌శాలల్లో నాడు-నేడు ద్వారా మౌళిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం ఇలాంటి పాఠశాలల రోడ్డు సమస్య పరిష్కారం పై దృష్టి సారించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దకాలంగా రోడ్డు సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో విద్యార్థులు, ఉపాద్యాయులు నిత్యం కష్టాలు పడుతూనే ఉన్నారు.


పట్టించుకోని అధికారులు… ప్రజాప్రతినిధులు :
పాపినేనిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ కు వెళ్లే దారి బురదమయంగా మారి ఏళ్ల తరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నా… ఇటు అధికారులు… అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సమస్యకు పరిస్కారం చూపాలని విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నరకయాతన పడుతూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.


న్యాయమూర్తులు జోక్యం చేసుకున్నా.. ఫలితం శూన్యం :
పాపినేనిపల్లి హైస్కూల్ రోడ్డు దుస్థితిని పత్రికలలో చూసిన న్యాయమూర్తులు చలించిపోయారు. బురదరోడ్డులో విద్యార్థుల అవస్థలు చూసినప్పటి మార్కాపురం 6వ కోర్టు న్యాయమూర్తి రామకృష్ణ, గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జి రాజేష్ లు గత ఏడాది స్వయంగా పాపినేనిపల్లి హైస్కూల్ ను సందర్శించారు. రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అధికారులను, గ్రామస్తులను, రైతులతో సమావేశం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పొలాలున్న రైతులను ఒప్పించి 20 అడుగుల రోడ్డు ఏర్పాటుకు రైతుల నుండి హామీ తీసుకొని తాత్కాలిక మెటల్ రోడ్డు వేసేందుకు విరాళాలు సైతం వసూలుకు శ్రీకారం చుట్టారు. వెంటనే మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత రోడ్డు అభివృద్ధి పై ఎవరూ దృష్టి పెట్టకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా చిల్లకంప పెరగడం వర్షం వస్తే రోడ్డు బురదమయంగా మారడంతో కొద్ది రోజులకు రోడ్డు పూర్వ స్థితికి చేరుకొంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు బురదరోడ్డుపై నడక కష్టం తప్పడం లేదు. ప్రతి నిత్యం విద్యార్థులు, ఉపాధ్యాయులు బడికి వెళ్లేందుకు సరైన రోడ్డు వసతిలేక ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునేవారు లేకపోవడంతో చేసేది లేక చివరకు పాఠశాల విద్యార్థులు రోడ్డు కోసం రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement